మహబూబాబాద్, మార్చి 25: గిరిజన రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లు గురించి తెలియదంటూ చౌకబారు రాజకీయాలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశానికి పెద్ద శనిలా తయారైందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. చాయ్‌వాలా ప్రధాని అయితే పేదలకు మేలు జరుగుతుందని అనుకొన్నారని, కానీ దేశానికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మహబూబాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గిరిజనుల జీవన విధానంపై అధ్యయనం చేసిన కేసీఆర్.. రాష్ట్రం సిద్ధించాక 6 శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ 10 శాతానికి పెంచాలని 2015లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెల్లప్ప కమిషన్ వేశారని తెలిపారు. 2017లో అసెంబ్లీ ఆమోదంతో రాష్ట్రపతికి నివేదిక కూడా సమర్పించారని గుర్తుచేశారు. గిరిజనులకు సంబంధించి తమకు ఎలాంటి నివేదిక, లేఖ రాలేదని కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు అబద్ధ్దాలు చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. గిరిజనులంటే గిట్టని బీజేపీ.. ఓ రాష్ట్రంలో గిరిజన పెండ్లి కొడుకు గుర్రం ఎక్కడం సహించలేక అతడి ప్రాణాలను తీసిందని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదని మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. గిరిజన వర్సిటీ కోసం రాష్ట్రం స్థలాన్ని అప్పగించినా నేటికీ అతీగతి లేదని మండిపడ్డారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి కేటాయించినా ఉలుకుపలుకు లేదన్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని విజ్ఞప్తిచేస్తే పట్టించుకోవట్లేదని ఆరోపించారు. గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ.12,565 కోట్లు కేటాయిస్తే.. కేంద్రం రూ.8 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నదని దుయ్యబట్టారు.