ఖమ్మం రూరల్/ ఇల్లెందు, నవంబర్ 6: పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, సంఘ నాయకులు ఖమ్మం రూరల్ మండలం ఈఎంసీ పరిధిలోని జేఎన్టీయూహెచ్ కళాశాల, ఇల్లెందు జేకే సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలతో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పి.సుధాకర్, భద్రాద్రి జిల్లా కార్యదర్శి బయ్య అభిమన్యు మాట్లాడుతూ మాది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు.. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని అన్నారు.
ఎన్నికల ముందు దొంగ హామీలు ఇచ్చిన గద్దెనెక్కారని, ఇప్పుడు హామీలు అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలకు రెండు దఫాలుగా నిధులు విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, ఇంకా ఎంత కాలం మోసం చేస్తారని వారు ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, లేదంటే విద్యార్థులతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వరుణ్‌తేజ్, నవదీప్, నజీర్, సుభాష్, శ్రావణ్, వినిల్, అఖిల్, రవి, సుధీర్, అనిల్, వినయ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.