
సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ):సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే యాదాద్రి ఆలయం, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిసరాల్లో సమగ్ర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి కాలువ (స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ) వ్యవస్థ ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేసే బాధ్యతలను ప్రభుత్వం జలమండలికి అప్పగించిన విషయం తెలిసిందే. జలమండలి ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు వరకు మంచినీటి సరఫరాకు ఓఆర్ఆర్ ప్రాజెక్టును, సీవరేజీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి మురుగునీటి వ్యవస్థను పటిష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఈ అనుభవం కలిగిన సంస్థగా జలమండలి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, యాదాద్రి టెంపుల్ పరిసరాల్లో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తును ప్రారంభించింది.
నెల రోజుల్లో డీపీఆర్ రూపొందించాలి
డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూప కల్పనకు ఇటీవల జలమండలి నోటిఫికేషన్ జారీ చేయగా.. ఎన్సీపీఈ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ టెండర్‌ను దకించుకుంది. ఈ సంస్థకు ఇప్పటికే ఉజ్జయినీ టెంపుల్ సిటీలో రూ.400 కోట్లతో మంచినీరు, సీవరేజీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన అనుభవం ఉంది. ఇందులో భాగంగా శుక్రవారం జలమండలి ఎండీ దానకిశోర్ ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎన్సీపీఈ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. యాదాద్రి టెంపుల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 12 చదరపు కిలోమీటర్లకు సంబంధించి సీవరేజీ, స్ట్రామ్ వాటర్ వ్యవస్థ, ఎస్టీపీల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లతో సహా డీపీఆర్‌ను పూర్తి చేసి నెల రోజుల్లో అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈడీ డా.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు, ఎన్సీపీఈ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.