(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఓటర్లకు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది. ఎన్యుమరేషన్ ఫారాలను నింపడంలో ఓటర్లకు అవగాహన కల్పించి సాయం చేయాల్సిన బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) పత్రాలను ఇచ్చేసి చేతులు దులుపుకొంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. దీంతో ఫారాలను ఎలా నింపాలో తెలియక మెజారిటీ ఓటర్లు ముఖ్యంగా నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో 2002లో ‘సర్’ ఎలా నిర్వహించారన్న అంశంపై చర్చ మొదలైంది. 2002లో జరిగిన ‘సర్’ ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, బీఎల్వోలే ఇంటింటికీ తిరుగుతూ ఫారాలను నింపారని మేధావులు గుర్తు చేస్తున్నారు.
దేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి 2004 వరకూ 8 సార్లు దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియను నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్నది 9వ విడుత. 2004 లోక్సభ ఎన్నికల కోసమని చివరిసారిగా 2002లో ‘సర్’ ప్రక్రియను నిర్వహించారు. ఈసీ అధికారుల సమాచారం ప్రకారం.. 2002లో మొదలైన ‘సర్’ ప్రక్రి య 2004 వరకూ కొనసాగింది.
ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘సర్’కు భిన్నం గా 2002 ‘సర్’ కొనసాగినట్టు మేధావులు చెప్తున్నారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నలకు ఈసీ ఇచ్చిన సమాధానాలను ఉదహరిస్తున్నారు. ఆ వివరాల ప్రకారం.. 2002 ‘సర్’ ప్రక్రియలో బీఎల్వోలు (అప్పుడు ఎన్యుమరేటర్లుగా పిలిచేవారు) ఇంటింటికీ వెళ్లేవారు. ఎన్యుమరేషన్ పత్రాలను ఇచ్చి, వాటిని నింపి తిరిగి ఇవ్వాలని ఓటర్లకు ఇప్పటి బీఎల్వోలు సూచిస్తుండగా.. అప్పటి బీఎల్వోలే ఫారాలను నింపేవారు. దీనికోసం జనగణనకు వివరాలు సేకరించినట్లుగానే.. ప్రతి ఇంటీకి వెళ్లి, ఒక్కో ఓటరును వివరాలు అడిగి వారి ముందే వాటిని స్వయంగా నమోదు చేసేవారు. తాజా ఫారాల్లో 2002 నాటి ‘సర్’ వివరాలను కూడా నమోదు చేయాలని అడుగుతున్నారు. కానీ, 2002లో ఆ పరిస్థితి లేదని నిపుణులు చెప్తున్నారు.
తాజా ‘సర్’ ప్రక్రియలో ఎన్యుమరేషన్ పత్రాలను నింపిన తర్వాత ఓటరు లేదా ఓటరు బంధువుతో డిక్లరేషన్ సంతకం తీసుకొంటున్నారు. తప్పుడు వివరాలు సమర్పిస్తే, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని 31 విభాగం కింద ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటికీ సిద్ధపడుతున్నట్టు హామీని కోరుతున్నారు. అయితే, 2002లో నిర్వహించిన ‘సర్’ ప్రక్రియలో బీఎల్వోలనే పూర్తి జవాబుదారులుగా చేసినట్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ప్రతినిధి పంక్తి జోక్ తెలిపారు. ఓటరు సమక్షంలో బీఎల్వోలే ఎన్యుమరేషన్ ఫారాలను నింపేవారని, ఫారాల్లో మార్పులు-చేర్పులు, ఎడిట్, డిలీట్ ఇలా అన్నింటికీ బీఎల్వోలే బాధ్యులుగా ఉండేవారని ఆమె గుర్తు చేశారు. ఫారాల కార్బన్ కాపీని కూడా ఓటరుకు రుజువు కింద ఇచ్చేవారన్నారు. మొత్తంగా 2002లో జరిగిన ‘సర్’ ఓటరుకు ఇబ్బంది లేకుండా సాగిందని, అయితే, ప్రస్తుత ‘సర్’లో అలాంటి పరిస్థితి లేదని వాపోయారు.
2002లో నిర్వహించిన ‘సర్’ ప్రక్రియలో బీఎల్వోలు మూడు రిజిస్టర్లను ఫీల్డ్లోకి తీసుకువెళ్లే వారని ఆర్టీఐ యాక్టివిస్ట్ సంతోష్ సిన్హ్ రాథోడ్ అన్నారు. ఓటరు పేరు, కుటుంబ సభ్యుల వివరాల్లో అక్షరదోషాల సవరణకు ఒకటి, ఎపిక్ నంబర్ ఉన్నప్పటికీ ఎలక్టోరల్ జాబితాలో పేరులేని వారి కోసం మరోటి, అడ్రస్ మారిన లేక మరణించిన వారి కోసం ఇంకో రిజిస్టర్ను బీఎల్వోలు కొనసాగించే వారని గుర్తు చేశారు. 2002 ‘సర్’లో ఓటర్ల తొలగింపులు తక్కువగా నమోదయ్యాయని విశ్లేషకులు చెప్తున్నారు. ముసాయిదా జాబితా ప్రకారం.. 2002లో 69.3 లక్షల ఓట్లను తొలగించినట్టు కేంద్రం పార్లమెంట్లో తెలిపింది.