జహీరాబాద్, ఆగస్టు 11 : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ సమీపంలో ముంబై హైవేపై మంగళవారం రాత్రి ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, దవాఖానకు తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ జిల్లా రాజగిరికి చెందిన కూలీలు మంగళవారం పనికోసం ఆటోలో జహీరాబాద్ ప్రాంతానికి వచ్చారు. సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి ఆటోలో బయలుదేరారు.
ఈ క్రమంలో హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై మొగుడంపల్లి మండలం సత్వార్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ ఆటోను ఢీకొట్టాడు. ఘటనలో రేఖ, శ్రీదేవి, దేవదాస్, కవిత, రేష్మతోపాటు ఆటోడ్రైవర్ దేవదాస్ దుర్మరణం చెందారు. నిఖితను దవాఖానకు తరలిస్తుండగా మరణించింది. తీవ్రంగా గాయపడిన నిర్మల, తుల్జమ్మ, చంద్రకళ, రాధిక, శిల్ప, శోభను జహీరాబాద్ ఏరియా దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సంగారెడ్డి, హైదరాబాద్ దవాఖానలకు తరలించారు. ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.