హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్ల మండలంలోని రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో బెరైటీస్, డోలమైట్స్ మైనింగ్‌ను నిలిపివేస్తూ అటవీ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. అటవీ శాఖ నోటీసులను సవాలు చేస్తూ కొన్ని మైనింగ్ కంపెనీలు, సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికకు ప్రామాణికత లేదంటూ మరికొన్ని కంపెనీలు 2009 నుంచి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల తీర్పు చెప్పారు.
రిజర్వు ఫారెస్ట్ భూమిని ప్రభుత్వ భూమిగా వర్గీకరిస్తూ రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటుతో ఈ వివాదం ప్రారంభమైందని, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల 1962 నుంచి సుమారు 762 ఎకరాల విస్తీర్ణంలో నిరాటంకంగా మైనింగ్ కార్యకలాపాలు కొనసాగడంతో గార్ల అటవీ ప్రాంతానికి నష్టం వాటిల్లిందని పేరొన్నారు. ప్రభుత్వ వాదన ప్రకారం మైనింగ్ కొనసాగుతున్న ప్రాంతం రిజర్వు ఫారెస్ట్‌లో అంతర్భాగమని, దీన్ని 1951 ఆగస్టు 17న నిజాం ప్రభుత్వం నోటిఫై చేసిందని తెలిపారు. మైనింగ్ కంపెనీల పిటిషన్లను కొట్టివేశారు.