తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో సినీ ప్రముఖుల నుంచి దళపతి విజయ్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ర కథానాయిక పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. త్వరలో విడుదల కాబోతున్న విజయ్ ‘జన నాయగన్’ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో తీసుకున్న ఓ సరదా వీడియోను పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
ఇందులో ఆమె ఓ వైట్ బోర్డ్ మీద ‘వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?’ అనే క్యాప్షన్‌ను రాసి దానిని పక్కనే ఉన్న విజయ్‌కి చూపిస్తూ సరదాగా కనిపిస్తున్నది. ఈ వీడియోను షేర్ చేసిన పూజాహెగ్డే ‘నేను ఈ విజయాన్ని ముందే ఊహించాను. కలలు నిజం కావడం చాలా ఆనందంగా ఉంది విజయ్ సార్’ అంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పూజాహెగ్డే జోస్యం ఫలించిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.