రామవరం, మే 26 : సార్.. రిజిస్టర్ పోస్ట్ చేయాలి.. కరెంట్ లేదు. డిపాజిట్ చేయాలి.. కరెంట్ లేదు వచ్చినాక రండి. ఉపాధి హామీ పైసలు కావాలి.. మిషన్ పని చేయడం లేదు. ఇది రుద్రంపూర్ పోస్టాఫీస్ సేవల తీరు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే వినియోగదారులు వెనుతిరిగి వెళ్లిపోవాల్సిందే. చుంచుపల్లి మండల పరిధిలో ఉన్న పెద్ద పోస్టాఫీస్‌లో ఇది ఒకటి. దీని ద్వారా రుద్రంపూర్, గౌతమ్‌పూర్, ధన్‌బాద్, వనమా నగర్, త్రీ ఇంక్లైన్, బంగ్లోస్, సుమారు 4 పంచాయతీ పరిధిలోని ప్రజలు ఈ పోస్టాఫీసు ద్వారా సేవలను వినియోగించుకుంటారు. పోస్టల్ సేవలతో పాటు, డిపాజిట్లు, ఉపాధి హామీ కూలీల వేతనాలను చెల్లించేందుకు గతంలో ఇక్కడ ఒక యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత యంత్రం పాడైపోవడంతో పంపించారు. ఇప్పటివరకు మళ్లీ తెప్పించలేదు. దీంతో ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
అంతేకాకుండా ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోతే వ్యవస్థ మొత్తం నిలిచిపోతుంది. గతంలో ఏర్పాటు చేసిన యూపీఎస్ సిస్టం పూర్తిగా పాడైపోవడంతో విద్యుత్ సరఫరా ఉంటేనే పనులు చేయడం లేదంటే తిరిగి పంపించేయడం చేస్తున్నారు. ప్రింటర్ సైతం సక్రమంగా పని చేయడం లేదు. ఈ విషయమై ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్ర స్వామిని వివరణ అడగగా గతంలో తీసుకున్న ఏజెన్సీ కాలపరిమితి ముగిసిందని, త్వరలోనే కొత్తవారిని నియమించుకొని సాధ్యమైనంత తొందరలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.