న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 692.89 పాయింట్లు లేదా 0.87 శాతం క్షీణించి 79 వేల స్థాయికి దిగువన 78,956.03 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 759.54 పాయింట్లు పడిపోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 208 పాయింట్లు లేదా 0.85 శాతం కోల్పోయి 24,139 వద్ద స్థిరపడింది. విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణల మధ్య హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 3 శాతానికిపైగా పడింది.
రంగాలవారీగా..
కమోడిటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు దూరం పెట్టారు. 1.84 శాతం నుంచి 1.45 శాతం మేర కోల్పోయాయి. మెటల్, సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. 1.37 శాతం నుంచి 0.84 శాతం మేర పడిపోయాయి. అలాగే బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 1.16 శాతం, మిడ్‌క్యాప్ 0.98 శాతం తగ్గాయి. నిజానికి ఈక్విటీ మార్కెట్లు ఉదయం ఆరంభంలో స్వల్ప నష్టాలతోనే మొదలయ్యాయి. అయితే సమయం గడుస్తున్నకొద్దీ నష్టాలు పెరుగుతూపోయాయి. జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆకర్షణీయ స్థాయిలో తగ్గుముఖం పట్టినా.. జూన్ నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ పతనం కావడం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా ప్రధాన మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపాలోని కీలక సూచీలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ కూడా లాభాల్లోనే కదలాడుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఒక్కరోజే విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) రూ.4,680.51 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
మార్కెట్ విలువ క్షీణత
వరుస నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లలో మదుపరుల సంపద క్రమేణా ఆవిరైపోతున్నది. ఈ ఒక్కరోజే రూ.4.52 లక్షల కోట్లు హరించుకుపోయింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.4,52,565.44 కోట్లు క్షీణించి రూ.4,45,30,265.42 కోట్ల (5.30 ట్రిలియన్ డాలర్లు)కు తగ్గింది. సోమవారం కూడా భారీ నష్టాలనే అందుకున్నా.. ఆఖర్లో సూచీలు కోలుకున్నాయి. దీంతో నష్ట తీవ్రత స్వల్పంగానే ఉన్నది.
నష్టాల్లోనే అదానీ గ్రూప్ షేర్లు
అదానీ గ్రూప్ అక్రమాల వ్యవహారంలో సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ సంస్థల షేర్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. బీఎస్ఈలో మంగళవారం కూడా 10 షేర్లలో 7 నష్టాలకే పరిమితం కావాల్సి వచ్చింది. అదానీ టోటల్ గ్యాస్ (1.94 శాతం), అదానీ గ్రీన్ ఎనర్జీ (1.38 శాతం), అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ (0.70 శాతం) షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. అదానీ విల్మర్ (2.37 శాతం), అదానీ ఎంటర్ప్రైజెస్ (1.92 శాతం), అంబుజా సిమెంట్స్ (1.86 శాతం), అదానీ పోర్ట్స్ (1.24 శాతం), ఏసీసీ (0.54 శాతం), అదానీ పవర్ (0.20 శాతం), ఎన్డీటీవీ (0.20 శాతం) నష్టపోయాయి. సోమవారం కూడా 8 షేర్లు నష్టపోయిన సంగతి విదితమే.