ముంబై, మే 28 : స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ ఐటీసీ షేరు కుదేలవడం మొత్తం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 239.31 పాయింట్లు కోల్పోయి 81,312.32 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 73.75 పాయింట్లు కోల్పోయి 24,752.45 వద్ద స్థిరపడింది. ఈవారంలోనే జీడీపీ గణాంకాలతోపాటు పారిశ్రామిక సూచీ విడుదలకానుండటంతో మదుపరులు అప్రమత్తకు మొగ్గుచూపారు. ఫలితంగా ఎఫ్ఎంసీజీ, వాహన, ఫార్రా రంగ షేర్లు పతనం చెందగా..బ్యాంకింగ్, పీఎస్‌యూ, మీడియా, ఎనర్జీ రంగ షేర్లు కదంతొక్కాయి. బ్రిటిష్ మల్టినేషనల్ బీఏటీ సంస్థ ఐటీసీలో తన వాటాను 2.5 శాతం మేర తగ్గించుకుంటున్నట్టు ప్రకటించడంతో ఐటీసీ షేరు కుప్పకూలింది.
ఒక దశలో ఐదు శాతానికి పైగా నష్టపోయిన షేరు చివరకు 3 శాతం నష్టపోయింది. దీంతోపాటు ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లె, అల్ట్రాటెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా షేర్లు పతనం చెందాయి. కానీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా ఎఫ్ఎంసీజీ 1.33 శాతం నష్టపోగా, మెటల్, వాహన, కన్జ్యూమర్ డ్యూరబుల్, కమోడిటీస్ షేర్లు దిగువముఖం పట్టాయి. కానీ, ఆర్థిక సేవలు, ఇండస్ట్రియల్స్, టెలికాం, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది.