ముంబై, డిసెంబర్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ వరుస నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష నేపథ్యంలో మదుపరులు ఆచితూచి స్పందిస్తున్నారు. అయితే మెజారిటీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో మంగళవారం సూచీలకు భారీ నష్టాలు తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,064.12 పాయింట్లు లేదా 1.30 శాతం క్షీణించి 81వేల మార్కుకు దిగువన 80,684.45 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలోనైతే 1,136.37 పాయింట్లు పతనమైంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 332.25 పాయింట్లు లేదా 1.35 శాతం పడిపోయి 24,336 వద్ద నిలిచింది. సోమవారం కూడా సెన్సెక్స్ 384.55 పాయింట్లు, నిఫ్టీ 100.05 పాయింట్లు దిగజారిన విషయం తెలిసిందే.
ఊగిసలాటలో..
క్రయవిక్రయాల నడుమ మదుపరులు ఊగిసలాటకు లోనయ్యారు. దీని వెనుకున్న కారణాలను విశ్లేషిస్తే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లు ద్రవ్యసమీక్షలు చేసి వడ్డీరేట్లపై నిర్ణయాలను ప్రకటించబోతున్నాయి. దీంతో స్టాక్, బాండ్ మార్కెట్లతోపాటు పెట్టుబడి తీరుతెన్నులు ప్రభావితం కానున్నాయి. గతంలో వడ్డీరేట్లను తగ్గించినప్పటికీ.. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ఇకపై వడ్డీరేట్లను ఫెడ్ రిజర్వ్ పెంచవచ్చన్న అంచనాలు మదుపరులను భయపెడుతున్నాయి. కాగా, జపాన్, ఇంగ్లాండ్ బ్యాంకులు ఇప్పుడున్న వడ్డీరేట్లనే కొనసాగించే వీలుందంటున్నారు. మరోవైపు భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు అదేపనిగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం, అంతర్జాతీయంగా మెజారిటీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కదలాడటం కూడా దెబ్బతీసింది. ఉదయం ఆరంభం నుంచే మార్కెట్లు నష్టాల్లో కదలాడాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. టెలికం సూచీ అత్యధికంగా 2.18 శాతం పడిపోయింది.
5 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ నష్టాలతో ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల్లో దేశ, విదేశీ మదుపరుల సంపద హరించుకుపోయింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.4,92,644.06 కోట్లు తగ్గి రూ.4,55, 13,913.24 కోట్లకు క్షీణించింది. రెండు రోజుల్లో సుమారు 6 లక్షల కోట్లు ఆవిరైంది.
నష్టాలకు ప్రధాన కారణాలు