2006 లో వచ్చిన శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ భామ పూర్ణ (Poorna ). ఆ తర్వాత తెలుగులో సీమటపాకాయ్ (Seema Tapakai), అవును, అవును 2 సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గతేడాది అఖండ చిత్రంలో కీ రోల్లో కనిపించింది. ఓ వైపు లీడ్ రోల్స్, మరోవైపు క్యారెక్టర్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్న పూర్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ (Poorna instagram)లో ఓ పోస్ట్ పెట్టి..ఈ విషయాన్ని అందరితో పంచుకుంది.
కాబోయే భర్త ఆసిఫ్ అలీ (Asif Ali)తో చిరునవ్వులు చిందిస్తూ దిగిన స్టిల్‌ను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పూర్ణ..’ కుటుంబసభ్యుల ఆశీస్సులతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నా..ఇపుడిక ఈ న్యూస్ అఫీషియల్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆసిఫ్ అలీ గల్ఫ్ కు చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తవగా..త్వరలో వెడ్డింగ్ బెల్స్ మోగబోతున్నాయి. త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న తమ అభిమాన నటికి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పూర్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉంది. తమిళంలో ఐదు సినిమాలు చేస్తుండగా..వీటిలో నాలుగు షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఒకటి చిత్రీకరణ దశలో ఉన్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. తెలుగులో నటిస్తోన్న రెండు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. మలయాళ ప్రాజెక్టు షూటింగ్ స్టేజ్‌లో ఉంది.