తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్ కృష్ణ (86) ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పూర్తి పేరు మాదాసు కృష్ణ. విశాఖపట్నంలో జన్మించారు. 1954లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి అగ్ర తారలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘భారత్ బంద్’ (1991)చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు. అనంతరం.. పెళ్లాం చెబితే వినాలి, పోలీస్ లాకప్, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, పుట్టింటికి రా చెల్లి వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు వంద చిత్రాల్లో విభిన్న పాత్రల్లో మెప్పించారు. జగపతిబాబు హీరోగా నటించిన ‘పెళ్లిపందిరి’ చిత్రంతో పాటు మరో ఏడు సినిమాల్ని నిర్మించారు. కాస్ట్యూమ్ కృష్ణ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.