‘చూడరా.. అమ్మాయి అయ్యుండి ఆటో నడుపుతోంది’ అనే గుసగుసలు, సూటిపోటి మాటలేవీ ఆమె ఆత్మైస్థెరాన్ని దెబ్బతీయలేక పోయాయి. ఆమె మనోవేగాన్ని అడ్డుకోనూ లేకపోయాయి. కష్టానికి కుంగిపోకుండా ప్రేమతో తండ్రి నేర్పిన డ్రైవింగ్‌నే వృత్తిగా ఎంచుకుని బతుకు బండిని సాఫీగా లాగిస్తున్నది చుక్క స్వాతి. ఉదయం ఆరయ్యిందంటే చాలు వావిళ్లపల్లి సెంటర్లో ఆటోతో రెడీగా ఉంటుంది. కుటుంబానికి అండగా, గ్రామస్తుల నోట్లో నాలుకలా ధైర్యంగా ముందుకు సాగుతున్న స్వాతి ఎందరి అభిమానాన్నో సొంతం చేసుకుని శెభాష్ అనిపించుకున్నది. ఆధునిక యుగంలోనూ వెంటాడుతున్న ఆధిపత్య ధోరణులను, ఆంక్షల సంకెళ్లను తెంచుకుని పోటీ ప్రపంచంలో విభిన్న రంగాల్లో రాణిస్తున్న ఇలాంటి మరింతమంది యువతులు, మహిళల స్ఫూర్తిదాయక కథనాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేటి సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇల్లాలిగా.. తల్లిగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. బయట ఉద్యోగం, వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతూ.. తమకు ఎదురు లేదని నిరూపిస్తున్నారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళల విజయ గాధలు..
ఆత్మకూరు(ఎం), మార్చి 7: తాను నిరుపేద అయినప్పటికీ సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగతోంది మండల కేంద్రానికి చెందిన సోలిపురం అరుణ. కరోనా నివారణలో తన వంతు సాయం అందించాలని భావించిన అరుణ.. తాను కూలి పనులు చేయడం ద్వారా వచ్చిన డబ్బులతో మాస్కు క్లాత్ కొనుగోలు చేసి స్వయంగా 5వేల మాస్కులు కుట్టింది. వాటిని అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసింది. దాంతో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శానిటైజర్ స్టాండ్లను బహూకరించింది. కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉపాధిహామీ కూలీలకు, పారిశుధ్య కార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు కరోనా బారిన పడిన వారికి నిత్యావసర సరుకులను కూడా అందజేసి ఆదుకొని ప్రజాప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు పొందింది.
యాదాద్రి భువనగిరి, మార్చి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఎక్కడ పుట్టాం అన్నది కాదు.. ఎక్కడిదాకా ఎదిగాం అనేదే ముఖ్యం అని నిరూపిస్తున్నది అడ్డగూడూరుకు చెందిన కొక్కిరేని సాత్విక. కర్రసాముతో పాటు వివి ధ క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రత్యేక గు ర్తింపును పొందిన ఈమెకు రాజ్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో గవర్నర్ చేతుల మీదుగా అవార్డు లభిం చింది. అడ్డగూడూరుకు చెందిన కక్కిరేని సాత్వికకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. 4 నుంచి 10వ తరగతి వరకు భువనగిరిలోని దివ్యబాల విద్యాలయంలో చదువుకుంది. మండల, డివిజన్ జిల్లాస్థాయిల్లో నిర్వహించిన కబడ్డీ, రన్నింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. ఖమ్మం జిల్లా లంకెపల్లిలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో షూటింగ్ బాల్లో ప్రావీణ్యం పొందింది. 2021లో తొర్రూరులో జరిగిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది. అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో నిర్వహించిన జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ కనబర్చింది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా బాలెంలలోని అరవిందాక్షర సోషల్ వెల్పేర్ డిగ్రీ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక కర్రసాముపై దృష్టిపెట్టి తన నైపుణ్యాన్ని మెరుగు పర్చుకుంటున్నది. 2021 సెప్టెంబర్‌లో మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన ‘సిలంబం’ పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఇదే ఏడాది సెప్టెంబర్‌లో జాతీయస్థాయి పోటీల్లోనూప్రతిభ కనబర్చి సిల్వర్ మెడల్ అందుకుంది.
అన్ని రకాల క్రీడల్లోనూ రాణిస్తున్న సాత్విక ప్రత్యేకించి కర్ర సాములో సత్తా చాటుతున్నది. కుటుంబ పరిస్థితులు ప్రతిబంధకంగా మారినప్పటికీ తల్లి రాణి అందిస్తున్న ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తున్నది. తండ్రి రమేశ్ ప్రమాదవశాత్తు కాలుకు గాయమై పని చేయలేని పరిస్థితిలో ఉండగా తల్లి చిన్నపాటి కిరాణషాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. ఆర్యవైశ్య కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో సాత్విక ముందుకు సాగుతోంది.
సంస్థాన్ నారాయణపురం, మార్చి 7 : డిగ్రీ వరకు చదివినా.. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి చలించింది. తండ్రి నేర్పిన ఆటో డ్రైవింగ్‌నే వృత్తిగా స్వీకరించి కుటుంబానికి అండగా నిలుస్తున్నది. మహిళలు తలచుకుంటే ఏ పనైనా సులభంగా చేయగలరని నిరూపిస్తున్నది సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామానికి చెందిన చుక్క స్వాతి.
జనగాం గ్రామానికి చెందిన చుక్క అబ్బయ్య, యాదమ్మ నిరుపేద దంపతులు. అబ్బయ్య ఆటో నడుపుతూ కుటంబాన్ని పోషించేవాడు. వీరికి నలుగురు ఆడపిల్లలు. అబ్బయ్య కష్టపడి ఇద్దరు కూతుళ్ల వివాహం చేశాడు. రెండు సంవత్సరల క్రితం అనారోగ్యంతో చిన్న కూతురు, ఏడాది క్రితం అబ్బయ్య కూడా అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో యాదమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ప్రతినెలా ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యమే కుటంబానికి దిక్కయ్యాయి. మూడో కూతురు స్వాతి బీకాం వరకు చదువుకుంది. ఒక సబ్జెక్టు తప్పడంతో ఫీజు కట్టే స్థోమత లేక చదువును మధ్యలోనే మానేసింది. తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతుండడంతో తన తండ్రి నడిపిన ఆటోనే నడపడం మొదలు పెట్టింది.
నాన్న నాకు ప్రేమతో నేర్పిన ఆటో డ్రైవింగ్ ప్రస్తుతం మా కుటుంబం కడుపు నింపుతున్నది. నాన్న చనిపోయాక అమ్మ పడుతున్న ఇబ్బందులు చూడలేక నాన్న ఆటోను నడపడం మొదలు పెట్టిన. రోజు వావిళ్లపల్లి నుంచి సంస్థాన్నారయణపురం వరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆటోలో ప్రయాణికులను చేరవేస్తా. రోజుకు రూ.400 వరకు వస్తున్నాయి. అవి అమ్మ మందులు, కుటంబ అవసరాలకు సరిపోతున్నాయి. మగరాయుడిలా తయారైయ్యావంటూ ఎంతో మంది హేళన చేస్తున్నా పట్టించుకోకుండా నా కుటుంబం కోసం ధైర్యంగా ముందుకు వెళ్తున్న.
నా భర్త ఏడాది క్రితం అనరోగ్యంతో చనిపోయాడు.అప్పటి నుంచి బిడ్డ ఆటో తోలుతూ వచ్చిన పైసలతోనే కాలం వెళ్లదీస్తున్నాం. బిడ్డకు పెండ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ చేతిలో రూపాయిలేక ఏం చేయాలో తోచడం లేదు. బిడ్డ పెండ్లికి మనసున్న మారాజులు ఎవరైన సహాయం చేస్తే.. జీవితాంతం రుణపడి ఉంటాం.
– యాదమ్మ, స్వాతి తల్లి
యుద్ధకళలను నేర్చుకుంటే ఆత్యరక్షణకు ఎంతో ఉపయోగ పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కర్రసాము సాధన అమ్మాయిలకు చాలా అవసరం. 10 మందికీ నావంతుగా ఈ విద్యలో శిక్షణ ఇస్తా. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది అమ్మ కలను నెరవేర్చాలన్నది నా కర్తవ్యం. అందులో భాగంగానే జాతీయస్థాయి క్రీడల్లో రాణించేందుకు కృషి చేస్తున్నా.
రాజాపేట, మార్చి 7 : ఆమె పట్టుదల, ఆత్మ విశ్యాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. సమాజానికి తన వంతు బాధ్యతగా సేవ చేయాలన్న సంకల్పంతో వైకల్యాన్ని ఎదిరించి వైద్య సేవలు అందిస్తున్నది. అకింతభావంతో పని చేస్తూ ఆరోగ్యశ్రీ విభాగంలో 14 ఏండ్లుగా రోగులకు సలహాలు, సూచనలు అందిస్తూ ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తున్నది ఆరోగ్య మిత్ర ప్రసందల.
రాజాపేట మండలంలోని పారుపల్లికి చెందిన చాడ వెంకట్‌రెడ్డి, సుగుణమ్మ దంపతుల మూడో కూతురు ప్రసందల. పుట్టుకతోనే దివ్యాంగులరాలైన్పటికీ పట్టుదలతో గ్రామంలోనే పదో తరగతి వరకు చదివింది. ఇంటర్ ఆలేరులో, డిగ్రీ, బీఈడీ భువనగిరిలో పూర్తి చేసింది. ఉద్యోగ వేటలో భాగంగా 2007లో ఆరోగ్య శాఖలో అవుట్‌సోర్సింగ్‌లో ఆరోగ్య మిత్రగా చేరింది. రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్నది. విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికి వెళ్లాలన్నా తమ్ముడి సాయం తీసుకుంటూ విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నది. శస్త్ర చికిత్స అవసరమున్న రోగుల ఇండ్లకు వెళ్లి ఏ దవాఖానకు వెళ్లాలో తెలియజేస్తుంది. ఫోన్ నంబర్ ఇచ్చి శస్త్ర చికిత్సలను ప్రోత్సహిస్తున్నది. రోగులను ఆప్యాయంగా పలుకరించి మనోధైర్యం నింపుతున్నది. గ్రామాల్లో ఎన్నో మెగా ఆరోగ్యశ్రీ క్యాంపులు నిర్వహించి పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా కృషి చేస్తుంది. దివ్యాంగురాలైనప్పటికీ నిబద్ధతతో పని చేస్తూ ఆరోగ్యశ్రీ క్యాంపులు నిర్వహించిన ప్రసందలకు 2014, 2019లో జిల్లా ఉత్తమ అవార్డులు దక్కడం విశేషం.
చౌటుప్పల్ రూరల్, మార్చి 7 : నల్లగొండకు చెందిన గాజుల నిర్మల గోపయ్య దంపతుల కూతురు మానస. ప్రస్తుతం ఎస్ఐగా విధినిర్వహణలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఉద్యోగ సాధనలో తనకు ఎదురైన సవాళ్లు ఆమె మాటల్లోనే.. మా నాన్న ఆర్టీసీలో సూపర్వైజర్గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. ఒక అన్నయ్య. నేను బీఎస్సీ నర్సింగ్ చదువుకున్న. మా అన్నయ్య చంద్రశేఖర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన స్ఫూర్తితో మహిళలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో నేను కూడా పోలీస్ ఉద్యోగంలో చేరాలనుకొని నిర్ణయించుకున్నాను. 2013లో నా వివాహం గాడలె నరేశ్‌తో జరిగింది. నాభర్త కూడా ప్రోత్సహించడంతో ఇంటికి దూరంగా ఉండి మూడేండ్ల పాటు కష్టపడి చదువుకున్నా. 2015లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేన్ రావడంతో పోలీస్ కానిస్టేబుల్,ఆర్టీఏ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ఒకేసారి దరఖాస్తు చేశాను. పట్టుదలతో చదవి 2016లో పరీక్షలు రాశాను. 2017లో వచ్చిన ఫలితాల్లో మూడు ఉద్యోగాలు ఒకేసారి వచ్చాయి. ఎస్ఐ ఉద్యోగానికి వెళ్లాను. శిక్షణ అనంతరం చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధుల్లో చేరాను. ప్రతి మహిళకంటూ ఒక ఉద్యోగం ఉండాలనేది నా అభిప్రాయం. చదువుతోనే ఎదైనా సాధించగలం. ఉద్యోగంపై ఉన్న ఆసక్తితో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంతోషంగా ముందుకు సాగుతున్నా.