మహబూబ్‌గర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి చేపడుతున్న ఇసుక దందాపై నమస్తే తెలంగాణ దిన పత్రికలో వరుస కథనాలు వస్తుండడంతో శనివారం దుందుభీ నదిలో అక్రమ రవాణాను నిలిపివేశారు. ‘ఎమ్మెల్యేలా మజాకా’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందించి వెంటనే ఇసుక తరలింపు ఆపాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఉప్పునుంతల మండ లం దాసర్లపల్లి వాగులో ఉన్న రెండు పెద్ద హిటాచీలను ఒడ్డుకు చేర్చారు. ఇసుక దందా నిలిపివేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే మండ లం పెద్దాపూర్ గ్రామంలో డిసెంబర్ 31వ తేదీన 350 ట్రిప్పుల ఇసుక డం పులు తాసీల్దార్ సునీత సీజ్ చేశారు.
అయితే అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో ఇసుక మాయమవుతూ వస్తుంది. కొంతమంది గ్రామస్తులు కాపు కాసి రాత్రి వచ్చిన ట్రాక్టర్లను పట్టుకున్నారు. డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు మూడు ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు. అధికారులు సీజ్ చేసిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన రవీందర్రావు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఇసుక దందాల వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉప్పునుంతల తెలకపల్లి మండలాల సరిహద్దుల్లోని గ్రామాల్లో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక దందాకు తాత్కాలికంగా తేరపడిందని మళ్లీ అదను చూసి ప్రారంభిస్తారని చుట్టుపక్కల గ్రామస్తులే అంటున్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ హస్తంపై చర్చ..
నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రం లో కోర్టు కాంప్లెక్స్ పనుల కోసం, జిల్లా కేంద్రంలో ఇతర ప్రభుత్వ భవనాలకు ఇసుక తరలిస్తున్నట్లు తీసుకొని అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై నమస్తే తెలంగాణ దినపత్రిక మూడు రోజుల నుంచి వరుస కథనాలు వస్తున్నాయి. ఈ ఇసుక దందా వెను క ఈ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఇసుక దొంగలు అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన దందాలో కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ యంత్రాంగం అండదండలతో సాగుతుందని ప్రచారం జరుగుతోంది.
తాసీల్దార్‌పై చర్యలేవి?
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల
తాసీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులకు తెలియకుండా ఇష్టానుసారంగా ఇసుకకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇక్కడ తాసీల్దార్‌గా పనిచేస్తున్న సునీత ఇసుక దందా సాగుతున్న రోజులు డ్యూటీకి రారని రెవెన్యూ సిబ్బంది బాహాటంగా చెబుతున్నారు. అనుమతులు ఇచ్చేసి మీటింగులు ఫీల్డ్ విజిట్ అంటూ కార్యాలయానికి డుమ్మా కొడతారని ప్రజలు తాసీల్దార్ కోసం ఎదురుచూసినా, ఫోన్ చేసిన మాట్లాడే పరిస్థితి ఉండదని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకకు అక్రమంగా అనుమతులు ఇచ్చిన తాసీల్దార్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. అధికార పార్టీ ఒత్తిడిల వల్లే కలెక్టర్, రెవెన్యూ మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తాసీల్దార్‌ను కాపాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి తాసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.