హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో తాగునీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు.
బుధవారం సచివాలయంలో తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం, ఏజెన్సీ ప్రాంతాల్లో పెసా చట్టం అమలుపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజూ నీటి సరఫరా పరిస్థితిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పైప్లైన్ లీకేజీలు, సరఫరా లోపాలను వెంటనే సరిచేయాలని సూచించారు. రాష్ట్రంలో పెసా పరిధిలోని 1,289 గ్రామపంచాయతీల్లో చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఆదేశించారు.