టెహ్రాన్, ఏప్రిల్ 8 : పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. రెండు వారాల కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న తన హెచ్చరికల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడానికి వీలు కల్పించిన చివరి నిమిషపు ఒప్పందం ఇది. యుద్ధంలో తమదే విజయమని అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో బుధవారం మళ్లీ దాడులు జరిగాయి.లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీన్ని నిరసిస్తూ హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. లెబనాన్‌పై దాడులు ఆపకపోతే ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించిది.
అమెరికా ఉపాధ్యక్షుడు క్లిష్టమైనదిగా అభివర్ణించిన ఈ ఒప్పందం నీరుగారిపోవడానికి తాజా దాడులు కారణమౌతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒప్పందంలోని అంశాలపై ఉభయపక్షాలు భిన్న వివరణలు ఇవ్వడంతో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇప్పటికీ స్పష్టత లేదు. హొర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై రవాణా రుసుము వసూలు చేసే విధానాన్ని అధికారికం చేసుకోవడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని ఇరాన్ తెలిపింది. కానీ ఒప్పందంలోని అంశాలు స్పష్టంగా లేవు. అలాగే చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గాన్ని ఉపయోగించడం నౌకలకు సురక్షితమనిపిస్తుందో లేదో కూడా స్పష్టత లేదు. ఈ షరతుకు వేరే ఏ దేశమైనా అంగీకరించిందీ కూడా స్పష్టత లేదు.
ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లాపై లెబనాన్‌లో ఇజ్రాయెల్ ప్రారంభించిన భూతల దాడులు తాత్కాలికంగా నిలిచిపోతాయని ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించడంలో సాయపడిన పాకిస్థాన్, ఇతర దేశాలు తెలిపాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌లో తమ దాడులు ఆగబోవని స్పష్టం చేయడంతోపాటు బుధవారం బీరుట్లో భీకర దాడులను కొనసాగించింది. యుద్ధం ప్రారంభించడానికి అమెరికా, ఇజ్రాయెల్‌కు ప్రధాన కారణాలైన ఇరాన్ క్షిపణి, అణు కార్యక్రమాల నిర్మూలన భవిష్యత్తు ఏమిటో కూడా స్పష్టత లేదు. శిథిలాల అడుగున ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వెలికితీయడంలో ఇరాన్‌తో కలసి పనిచేస్తామని ట్రంప్ ప్రకటించగా ఇరాన్ మాత్రం దీన్ని ధృవీకరించలేదు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం టెహ్రాన్ వీధుల్లోకి వచ్చిన ఇరాన్ పౌరులు అమెరికాకు మరణం, ఇజ్రాయెల్‌కు మరణం అని నినాదాలు చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను తగలబెట్టారు.

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలసి అమెరికా ప్రారంభించిన యుద్ధాన్ని ముగించడంలో ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళిక సాయపడుతుందని ట్రంప్ తొలుత అన్నారు. అయితే అణ్వాయుధ నిర్మాణానికి కీలకమైన యురేనియంను శుద్ధి చేసే ప్రక్రియను ఇరాన్ కొనసాగించడానికి అనుమతిస్తారని సూచిస్తూ పార్సీ భాషలో ఒక ప్రకటన వెలువడగా ట్రంప్ దానిపై వివరణ ఇవ్వకుండానే అది మోసపూరితమైనదని ఖండించారు. హొర్ముజ్ జలసంధి సమీపంలోనే అమెరికా యుద్ధనౌకలు చక్కర్లు కొడుతూ ఉంటాయని కూడా ట్రంప్ సూచించారు. రానున్న రోజుల్లో అది ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ చేస్తున్న డిమాండ్లలో ఆ ప్రాంతం నుంచి అమెరికా సైనిక దళాలను ఉపసంహరించుకోవడం, ఆంక్షలను ఎత్తివేయడం, స్తంభింపచేసిన తమ ఆస్తులను విడుదల చేయడం వంటివి ఉన్నాయి. యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే అంశంపై ఇస్లామాబాద్‌లో 11న మొదటి విడత చర్చలు ప్రారంభమవుతాయని, ఉపాధ్యక్షుడు వాన్స్ అమెరికా బృందానికి సారథ్యం వహిస్తారని వైట్‌హౌస్ తెలిపింది.
ఇరాన్‌తో అమెరికా కాల్పుల విరమణ ఒప్పందానికి బుధవారం ఉదయం మద్దతు పలికిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హెజ్బొల్లాతో తమ యుద్ధం ఈ ఒప్పందం పరిధిలోకి రాదని తేల్చిచెప్పారు. లెబనాన్‌లో దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ సైన్యం కూడా తర్వాత ప్రకటించింది. అయితే కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉంటామన్న విషయాన్ని హెజ్బొల్లా ధృవీకరించలేదు. ఒప్పందాన్ని కుదిర్చే అవకాశాన్ని మధ్యవర్తులకు ఇవ్వడానికి సిద్ధమని మాత్రం హెజ్బొల్లా తెలిపింది.