న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: డెట్ సెక్యూరిటీస్ పబ్లిక్ ఇష్యూ, నాన్-కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల లిస్టింగ్కున్న సమయాన్ని 3 రోజులకు తగ్గించాలని మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇది 6 రోజులుగా ఉన్నది. పబ్లిక్ ఇష్యూ జారీదారులు నిధులను మరింత త్వరగా అందిపుచ్చుకోవడానికి ఇది దోహదం చేయనున్నది.
ఈ ఏడాది నవంబర్ 1 నుంచి కొత్త టైమ్‌లైన్స్ అమల్లోకి రానున్నాయి. అయితే తొలి ఏడాది ఈ టైమ్‌లైన్‌ను ఇష్యూయర్స్ పాటించవచ్చు లేదా పాటించకుండా ఉండవచ్చు. కానీ వచ్చే ఏడాది నవంబర్ 1 నుంచి మాత్రం తప్పక పాటించాల్సిందేనని సెబీ తాజాగా స్పష్టం చేసింది.
రామగుండం ఎన్టీపీసీకి ఎనర్జీ లీడర్షిప్ అవార్డులు
జ్యోతినగర్, సెప్టెంబర్ 26: రామగుండం ఎన్టీపీసీకి ఇంధన ఉత్పాదకత, సంరక్షణ, పరిరక్షణల్లో మూడు ఎనర్జీ లీడర్షిప్ అవార్డులు లభించాయి. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్షిప్ అవార్డ్స్-2024లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేతులమీదుగా సంస్థ ఈడీ కేదార్ రంజన్పాడు అవార్డులను అందుకున్నారు. విద్యుత్తు, పునరుత్పాదకత, ఇండస్ట్రియల్ విభాగాల్లో ఇవి దక్కాయి.
ఆజియోలో హెచ్అండ్ఎం
ముంబై, సెప్టెంబర్ 26: రిలయన్స్ రిటైల్‌కు చెందిన ప్రీమియం ఫ్యాషన్ ఈ-టెయిలర్ ఆజియో.. స్వీడన్ ఫ్యాషన్ దిగ్గజం హెచ్అండ్ఎంతో జట్టు కట్టింది. దీంతో ఆజియో వేదికపై ఇక హెచ్అండ్ఎం బ్రాండ్ ఉత్పత్తులు లభించనున్నాయి. ఉమెన్స్వేర్, మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్, హోం డెకరేషన్ తదితర 10వేల కలెక్షన్స్‌ను ఆజియోపై హెచ్అండ్ఎం పెడుతున్నది. ఈ పండుగ సీజన్లో సరసమైన ధరలకు నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులను కొనుగోలుదారులు ఆజియో ద్వారా అందుకోవచ్చన్న విశ్వాసాన్ని సదరు సంస్థలు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వ్యక్తం చేశాయి.