గర్భం దాల్చాలనుకొనే మహిళలు నిద్రకు ఉపక్రమించే సమయం పైనా, నిద్రించే వ్యవధిపైనా శాస్త్రవేత్తలు కీలక సూచన చేశారు. రాత్రి 10.45 గంటల్లోగా నిద్రపోవాలని సూచించారు. ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిం చడం వల్ల అంతర్గత జీవ గడియారానికి విఘాతం కలిగి హార్మోనల్ చైన్ రియాక్షన్ వస్తుందని తెలిపారు. ఫలితంగా అండం, శుక్ర కణాల ఫలదీకరణ అవకాశాలు తగ్గి సంతాన లేమికి దారి తీస్తుందన్నారు.
Pregnancy | న్యూఢిల్లీ/(స్పెషల్ టాస్క్ బ్యూరో), జూలై 27: మహిళల గర్భదారణకు పురుషుల శుక్ర కణాల సంఖ్య, వాటి కదలిక, కలిసే సమయం, అండం విడుదల తేదీ, హార్మోన్ల ప్రభావం.. ఇలా ప్రతీ విషయం కీలక పాత్ర పోషిస్తాయని తెలిసిందే. అయితే, మహిళల గర్భ ధారణకు వాళ్లు నిద్రపోయే సమయం కూడా కీలక పాత్ర చూపిస్తుందని తెలుసా? చైనాలోని హునన్లో ఉన్న సెకండ్ జియాంగ్యా హాస్పిటల్ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం ఈ విషయాన్నే వెల్లడించింది.
గర్భం దాల్చాలనుకునే మహిళలు రాత్రి 10.45 గంటలలోగా నిద్రపోవాలని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. 2015-2020 మధ్య దాదాపు 4,000 మంది మహిళల దినచర్యను విశ్లేషించినప్పుడు.. రాత్రి 10.45 గంటల తర్వాత నిద్రపోయేవారిలో 22 శాతం మందికి సంతానోత్పత్తి సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు. రాత్రి 10.45 గంటల తర్వాత నిద్రపోయే మహిళలు గర్భం దాల్చే అవకాశాలు ఐదో వంతుకుపైగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఎండోక్రినాలజీ’ అనే జర్నల్లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది.
ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం వల్ల శరీరంలోని అంతర్గత జీవ గడియారానికి విఘాతం కలుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. హార్మోనల్ చైన్ రియాక్షన్ వస్తుందని, ఫలితంగా మహిళ విడుదల చేసే అండం, పురుషుడు విడుదల చేసే శుక్ర కణాలు ఫలదీకరణమయ్యే అవకాశాలు తగ్గుతాయని పేర్కొన్నారు. హార్మోనల్ మెకానిజమ్స్ అత్యంత కట్టుదిట్టంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థను నియంత్రిస్తాయని పరిశోధకులు తెలిపారు. ఈ మెకానిజానికి ఏర్పడే అంతరాయం సంతాన లేమికి దారి తీస్తుందని వివరించారు. దంపతులు ఓ కుటుంబాన్ని ఏర్పరచుకోవాలంటే కచ్చితంగా సకాలంలో నిద్రపోవడం తప్పనిసరి అని చెప్పారు.