న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ కేసులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. ఈ కేసులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) సీల్డ్ కవర్లలో సమర్పించిన రెండు నివేదికలను పరిశీలించింది. సైబర్ నేరగాళ్లు వయోవృద్ధులతో సహా అనేక మంది నుంచి రూ.3,000 కోట్ల మేరకు సైబర్ నేరగాళ్లు దోచుకోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాము కఠినమైన ఆదేశాలను జారీ చేయకపోతే, ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని పేర్కొంది. దర్యాప్తు సంస్థలను న్యాయపరమైన ఆదేశాల ద్వారా బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పింది. ఈ నేరాల విషయంలో ఉక్కు పిడికిలితో వ్యవహరించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేసింది. కోర్టుకు సహాయపడేందుకు సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ ఇచ్చే సలహాల ఆధారంగా ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 10న జరుగుతుందని తెలిపింది.
న్యూఢిల్లీ : అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన చీఫ్ సెక్రటరీల హాజరును నమోదు చేసిన తర్వాత వీధి కుక్కల నిర్వహణకు సంబంధించి చేపట్టిన సుమోటో కేసులో నవంబర్ 7న తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలియచేసింది. అన్ని రాష్ర్టాలకు చెందిన సీఎస్‌లు హాజరై అఫిడవిట్లు సమర్పించారని ధర్మాసనం తెలిపింది. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇంకా అఫిడవిట్లు రావలసి ఉందని పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు, కార్యాలయ ప్రాంగణాలలో వీధి కుక్కలకు ఆహారం అందచేయడానికి సంబంధించి త్వరలోనే నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
న్యూఢిల్లీ: పోర్నోగ్రఫీపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇటీవల నేపాల్‌లో జరిగిన జెన్ జీ ఉద్యమాన్ని ప్రస్తావించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. కానీ నాలుగు వారాల తర్వాత విచారణకు హామీ ఇచ్చింది. పోర్నోగ్రఫీ కంటెంట్ అందుబాటులో ఉండటంపై పరిమితులు విధించే విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలని పిటిషనర్ కోరారు. ముఖ్యంగా ఈ కంటెంట్ మైనర్లకు అందుబాటులో ఉండటంపై ఆంక్షలు విధించాలన్నారు. చాలా వెబ్సైట్లు పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తున్నాయని, దాని వల్ల వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, బలవంతంగా డిజిటల్ కంటెంట్‌పై నిషేధం విధించడం వల్ల నేపాల్‌లో మాదిరిగా అశాంతి చెలరేగే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించింది. ‘నిషేధంపై నేపాల్‌లో ఏం జరిగిందో చూడండి’ అని పేర్కొంది.