హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో కొ త్తగా తొమ్మిది సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లను ఏర్పాటుచేయాలని నిర్ణయించా రు. అంతేకాకుండా సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లోని అధ్యాపక సిబ్బందికి యూజీసీ పేస్కేల్‌ను అమలు చేయనున్నారు. ఇందుకు సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్(బీజీ) ఆమోదం తెలిపింది. సచివాలయంలో గురుకుల సొసైటీ చైర్మన్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నేతృత్వంలో గురువారం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం జరిగింది. మొత్తంగా 26 అంశాలపై బోర్డు చర్చించింది. అందులో పలు అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ విద్య, ఉపాధ్యాయ సంక్షేమం, ఉన్నత విద్య అవకాశాల విస్తరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను ఆమోదించినట్టు వెల్లడించారు. బోర్డు నిర్ణయాలను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ యూనియన్ నేతలు రామలక్ష్మణ్, కీర్తి రవితోపాటు పలు యూనియన్ నేతలు స్వాగతించారు. సమావేశంలో బోర్డు సభ్యులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్ దోత్రే, ప్రొఫెసర్ కాశీం, సొసైటీ కార్యదర్శి శారద, ఎస్టీ గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, టీజీఆర్ ఈఐఎస్ కార్యదర్శి ఉషారాణి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అభిలాష అభినవ్, ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్‌సింగ్, ఓఎస్ డీవైజే విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.