హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాచకొండ సైబర్ క్రైం పోలీసులు చేసిన ఓ కేసు దర్యాప్తు దేశంలోని ఎస్బీఐ ఖాతాదారులందరికీ వరంగా మారింది. సైబర్ నేరగాళ్ల తీరుపై వీరు అందించిన సమాచారంతో అప్రమత్తమైన ఎస్బీఐ అధికారులు తమ ఖాతాదారుల ఆర్థిక వ్యవహారాలను మరింత సురక్షితంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు మరో సెక్యూరిటీ ఫీచర్‌ను జోడించి కొత్తగా ఆరు అంకెల ఓటీపీ (వన్‌టైమ్ పాస్వర్డ్) పిన్ను అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో ఇకపై ఎస్బీఐ ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతిలో లావాదేవీ నిర్వహించాలంటే ఓటీపీ, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తోపాటు కొత్తగా వచ్చే ఆరు అంకెల ఓటీపీ పిన్ను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. లేకపోతే ఆ లావాదేవీ పూర్తికాదు. ఈ ఫీచర్‌తో లక్షల మంది ఎస్బీఐ ఖాతాదారులకు సైబర్ నేరగాళ్ల బెడద తప్పినట్టే.