షెన్జెన్ (చైనా): భారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్లో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ సాత్విక్-చిరాగ్ ద్వయం 21-16, 18-21, 21-11తో మలేషియాకు చెందిన నూర్ అయుబ్ – తాన్ వీ కియోంగ్ జంటను ఓడించింది. గంటా ఆరు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భారత జంట అద్భుతమైన వ్యూహాత్మక ఆటతీరుతో అలరించింది.
ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ గత నాలుగేండ్లలో మూడోసారి (2023, 25, 26) ఈ టోర్నీ ఫైనల్‌కు చేరింది. సెమీస్ తొలి గేమ్‌ను 0-5తో ఆరంభించిన భారత జోడీ వెంటనే తేరుకుంది. ఏకాగ్రత కోల్పోకుండా వరుసగా ఏడు పాయింట్లు సాధించి 7-5తో ఆధిక్యంలోకి వచ్చిన సాత్విక్-చిరాగ్ తర్వాత ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొలి గేమ్‌ను సులువుగా ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్ కోల్పోయినా నిర్ణయాత్వక మూడో గేమ్‌లో భారత షట్లర్లు బలమైన స్మాష్‌లతో పాటు నెట్ గేమ్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జోడీ చైనాకు చెందిన హే జి టింగ్-రెన్ జియాంగ్ యు ద్వయంతో పోటీ పడనుంది.