Satish Reddy : ‘ఎంపీ బండి సంజయ్ కేంద్రహోంశాఖ మంత్రా?.. దొంగల శాఖ మంత్రా?’ అని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి(Satish Reddy) ప్రశ్నించారు. పోక్సో(POCSO) కేసు భయంతో కేంద్రమంత్రి కొడుకే పారిపోయాడని స్వయంగా పోలీసులు చెబుతున్నారంటే.. ఇక దేశంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నట్టు? అని ఆయన విమర్శించారు. దేశంలో నేరగాళ్లను పట్టుకోవాల్సిన హోంశాఖకు మంత్రిగా ఉండి.. కొడుకునే పరారీ చేశారంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని సతీశ్ రెడ్డి అన్నారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏం సమాధానం చెబుతారు? అని ఆయన ప్రశ్నించారు.
బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదయ్యాక కూడా మంత్రితో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం రేవంత్ రెడ్డి వేదిక పంచుకున్నప్పుడే అనేక అనుమానాలు కలిగాయని సతీష్ రెడ్డి అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ ఎస్ బ్రదర్స్ కలిసి నిందితుడిని తప్పించినట్టు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చిన మోడీ విమానంలోనే బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను రాష్ట్రం నుండి బయటకు పంపారేమోననే అనుమానాలు కూడా కలుగుతున్నాయని సతీష్ రెడ్డి అన్నారు.
కుమారుడిపై పోక్సో కేసు నమోదైనందున హోంశాఖ మంత్రి పదవిలో కొనసాగడానికి బండి సంజయ్ అనర్హుడని సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు. బండి సంజయ్‌కు సిగ్గు, శరం ఉంటే.. నైతిక భాద్యతగా వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన కొడుకు ఏ తప్పు చేయలేదని చెబుతున్న బండి వెంటనే అతడిని పోలీసులకు అప్పగించాలని సతీశ్ సవాల్ విసిరారు. ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దాచిపెడుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే బండి సంజయ్‌ను కేంద్రమంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ వ్యవహారంలో బాధితురాలికి అన్యాయం చేసి.. నిందితుడిని రక్షించేందుకు మోడీ కూడా మద్దతు ఇచ్చారని భావించాల్సి ఉంటుందని రెడ్కో మాజీ ఛైర్మన్ పేర్కొన్నారు.