Hunger | ఆకలిగా అనిపిస్తే వెంటనే ఏదైనా తినాలనే భావన చాలా మందిలో ఉంటుంది. మరోవైపు, బరువు తగ్గాలంటే ఆకలిని అదుపులో పెట్టుకోవాలని కూడా చాలామంది అనుకుంటారు. అయితే ఆకలిని అణచిపెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. శరీరం ఇచ్చే ఆకలి సంకేతాలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం అని వారు సూచిస్తున్నారు. ఆకలిని పూర్తిగా నియంత్రించాలనే ప్రయత్నం చేస్తే, అది శరీరంలోని సహజ జీవక్రియలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరిస్తున్నారు. రోజంతా ఆకలి వేయకపోవడం ఆరోగ్య సూచిక కాదని, అది శరీరంతో ఉన్న అనుబంధం తగ్గిపోవడమే అని వారు పేర్కొంటున్నారు. ఆకలి అనేది బలహీనత కాదని, అది జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తోందనే సంకేతమని వివరిస్తున్నారు.
ఆహారం తినడం, జీర్ణం కావడం, పోషకాలు శరీరానికి చేరడం, మళ్లీ ఆకలి వేయడం, ఇవన్నీ శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియలని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఆకలిని తరచూ నిరోధించడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం, ఆహారపు అలవాట్లు అసమతుల్యంగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయని, శరీరం ఇచ్చే ఆకలి సంకేతాన్ని కూడా గుర్తించాలని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉదయం అల్పాహారం మానేయడం వల్ల శరీరం సహజ ఆకలి సంకేతాలను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకలి అనేది ఘ్రెలిన్ (Ghrelin), లెప్టిన్ (Leptin), ఇన్సులిన్, శరీర బయోలాజికల్ క్లాక్ అయిన సర్కేడియన్ రిథమ్ ద్వారా నియంత్రణలో ఉంటుంది. తరచూ ఏదో ఒకటి తినడం, భోజనాలను మానేయడం లేదా ఆకలి వచ్చినా పట్టించుకోకపోవడం వల్ల ఈ వ్యవస్థ అసమతుల్యంగా మారుతుందని వివరించారు. దాంతో ఎక్కువగా తినాలనిపించడం, శరీరంలో శక్తి అస్థిరంగా ఉండటం, తర్వాత ఎక్కువగా తినే అలవాటు పెరగడం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
అసమయ భోజనం, ఆకలి సంకేతాలను నిరోధించడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే భోజన సమయాల్లో క్రమబద్ధత లేకపోతే గ్లూకోజ్ మెటబాలిజం, కొవ్వు నిల్వలు, హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన మెటబాలిజం అంటే ఆకలిని తొలగించడం కాదని, సరైన సమయానికి ఆకలి అయ్యేలా చేయడమేనని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం భోజనాల మధ్య తగిన విరామం ఇవ్వడం, తరచూ చిరుతిండ్లు తినకపోవడం, ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. అలాగే విసుగు వల్ల కలిగే ఆకలి, నిజమైన శారీరక ఆకలి మధ్య తేడాను గుర్తించుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇక ఆకలిని అణచిపెట్టకుండా దానిని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు.