ఖానాపూర్ టౌన్, డిసెంబర్ 4 : బీఆర్ఎస్ నేత, సర్పంచ్ అభ్యర్థి భర్త బండారి రవీందర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమార్పేటలో గురువారం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి, బెదిరింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ రవీందర్ భార్య, సర్పంచ్ అభ్యర్థి పుష్ప పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం స్పష్టించింది. మృతుడి భార్య పుష్ప కథనం ప్రకారం.. సోమార్‌పేట్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ బండారి పుష్ప-రవీందర్ దంపతులు.. దీక్షా దివస్ సందర్భంగా నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేశారు. తొలి విడతలో ఎన్నికలు నిర్వహించే ఈ గ్రామంలో సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో బీఆర్ఎస్ మద్దతుతో బండారి పుష్ప నామినేషన్ వేశారు. కొన్నిరోజులుగా కొందరు కాంగ్రెస్ నాయకులు రవీందర్ (54)ను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని బలవంతం చేస్తున్నారు. ‘నువ్వు మా పార్టీలోకి వస్తే.. మేము మద్దతిస్తున్న అభ్యర్థితో నామినేషన్ విత్‌డ్రా చేయిస్తాం.
మిమ్మల్ని సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తాం’ అంటూ ఒత్తిడి తెచ్చారు. నామినేషన్ల విత్‌డ్రాకు ఆఖరి రోజైన ఈ నెల 3న ఒత్తిడి మరింత పెంచారు. కానీ ఏకగ్రీవానికి అంగీకరించకుండా పోటీలోనే ఉన్నారు. రవీందర్ గ్రామంలో ప్రచారం చేసి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి చేరుకున్నాడు. ఇదే విషయమై రవీందర్ అర్ధరాత్రి వరకు ఫోన్లు మాట్లాడినట్టు అతడి భార్య పుష్ప తెలిపింది. ఫోన్లో ఎవరు మాట్లాడారో.. ఏం జరిగిందో తెలియదు. కానీ.. గురువారం ఉదయం 5 గంటలకు పశువుల పాకలో దూలానికి ఉరివేసుకొని తన భర్త రవీందర్ ఆత్మహత్య చేసుకొన్నట్టు విలపించింది. రాత్రంతా ఫోన్లోనే మాట్లాడిన తన భర్త ఆత్మహత్యకు రాజకీయ బెదిరింపులే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఫోన్ ఆధారంగా విచారణ చేపట్టి, తన భర్త ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.
సోమార్‌పేట్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బండారి రవీందర్ మృతి కి బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయ క్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన సోమార్పేట్ వెళ్లి బాధిత కు టుంబాన్ని పరామర్శించారు. బాధి త కుటుంబానికి బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రవీందర్ మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.