వరంగల్, ఏప్రిల్ 1(నమస్తేతెలంగాణ): వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రోగిపై ఎలుకల దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన వారందరిపైనా చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఇప్పటికే దవాఖాన సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతోపాటు ప్రాథమిక విచారణ మేరకు ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశామన్నారు. ఘటన జరిగిన ఆర్ఐసీయూ హెచ్‌వోడీ నాగార్జునరెడ్డి నిర్లక్ష్యంపైనా విచారణ జరుగుతున్నదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆర్ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను ఎలుకలు కొరకడం, అతడికి రక్తస్రావం జరిగిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి దయాకర్‌రావు వరంగల్ ఎంజీ ఎం హాస్పిటల్‌ను సందర్శించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి, ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెం ట్ చంద్రశేఖర్‌తో కలిసి ఎలుకలు దాడి చేసిన ఆర్ఐసీయూని పరిశీలించారు. బాధితుడు శ్రీనివాస్‌ను పరామర్శించి అతని కుటుంబసభ్యులు, బంధువులతో మాట్లాడారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బాధితుడు శ్రీనివాస్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలిస్తామని చెప్పారు. పేషెంట్ కేర్, పారిశుద్ధ్య పనులు చూస్తున్న ఏజెన్సీపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శ్రీనివాస్‌కు నిమ్స్‌లో వైద్యం
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు శ్రీనివాస్‌ను శుక్రవారం నిమ్స్‌కు తరలించారు. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగానే ఉన్నదని నిమ్స్ వైద్యులు తెలిపారు.