ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఆ రోజులే వేరు.. పలు సందర్భాల్లో ఇలాంటి మాటలు మనం వింటుంటాం. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో పాత శాస్త్రీయ పద్ధతులే మేలనిపిస్తాయి. ప్రధానంగా వంటల విషయం.. అప్పట్లో మన పూర్వీకులు వంటలన్నీ మట్టిపాత్రల్లోనే చేసేవారు. వారి సంపూర్ణ ఆరోగ్య రహస్యానికి ఇది కూడా ఒక కారణం. కాలక్రమేణా వీటి స్థానంలో అల్యూమీనియం, స్టీల్, ఇత్తడితో పాటు వివిధ రకాల ఎలక్ట్రికల్ వస్తువులు వచ్చాయి. ప్రారంభంలో ఇవి సౌకర్యవంతంగా అనిపించినా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండడంతో ప్రస్తుతం ప్రజలు మళ్లీ మట్టి పాత్రలపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మట్టితో చేసిన వివిధ రకాల గిన్నెలు, బాటిళ్లు, కుక్కర్లు, ప్యాన్లు, టీ గ్లాసులు, గృహాలంకరణ వంటి వస్తువులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. హోటళ్ల నిర్వాహకులు సైతం ఈ పాత్రల్లో వండిన వంటలను ‘స్పెషల్ ఐటమ్’గా విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు.
మట్టి పాత్రలు, రాగి పాత్రలు ఆరోగ్యానికి మంచివని మన పూర్వీకులు వినియోగించేవారు. ఇప్పటికీ పల్లెల్లో కట్టెల పొయ్యిపైనే మట్టిపాత్రల్లో వంట చేయడం కనిపిస్తున్నది. కొన్నే ళ్ల కిందట వీటి ఉపయోగం చాలా ఉండేది. కానీ కాలక్రమేణా వినియోగం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం వినియోగిస్తు న్న పాత్రల తయారీలో రసాయనాలను వినియోగిస్తుంటారు. వీటిని వాడుతున్న ప్రజలకు నేడు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్న ప్రజలు మళ్లీ పాతదనమే కోరుకుంటున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రకారం వంటకై అధునాతన పాత్రలొచ్చినా మట్టిపాత్రలు, రాగిచెంబులను వాడటం పెరుగుతోంది. ఆరోగ్యరీత్యా ప్రస్తుతం సమాజంలో వీటి వినియోగంపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మట్టిపాత్రలు, రాగిపాత్రల అమ్మకాలు నానాటికీ పెరుగుతున్నాయి.
పెరుగుతున్న వినియోగం
ఇప్పటి వరకు అల్యూమీనియం, స్టీల్, ఇత్తడితో పాటు వివిధ రకాల ఎలక్ట్రికల్ రైస్కుక్కర్స్, రోటిమేకర్స్ వంటి పాత్రలు వాడుతున్నా ప్రజ లు మట్టి పాత్రలపై మనసు పారేసుకున్నారు. ఆరోగ్యరీత్యా మట్టి పాత్రలే మంచివని భావిం చి వీటిలోనే వంటలు చేస్తున్నారు. మట్టితో చేసిన వివిధ రకా ల పాత్రలు, గిన్నెలు, రకరకాల వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి. వంట చేసుకునేందుకు వివిధ ఆకారాల్లో మట్టి గిన్నెలు అందుబాటులోకి వచ్చాయి. కుక్కర్లు, ప్యాన్లు, నీటి ని తాగడానికి గ్లాసులు, బాటిళ్లు సైతం మట్టితో తయారు చేసినవి మార్కెట్లో సందడి చేస్తున్నాయి. పలు హోటళ్లు, రెస్టారెంట్లలో మట్టిపాత్రల్లోనే వంటకాలు చేస్తున్నారు. దేశీచికెన్, చికెన్‌లోని వివిధ రకాల వంటకాల కోసం మట్టి పాత్రలనే వినియోగిస్తున్నట్లు హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి కాలంలో రంజన్లు ఉపయోగించే ప్రజలు ఇప్పుడు అన్ని సీజన్లలో మట్టి పాత్రలను వినియోగిస్తున్నారు.
కుండ బిర్యానీకి డిమాండ్
పట్టణాల్లో రెస్టారెంట్లలో కుండ బిర్యానీ ప్రత్యేకంగా లభిస్తున్నది. గ్రామాలకు సైతం విస్తరిస్తున్న క్రమంలో రుచిగా ఉండే ఈ బిర్యానీకి డిమాండ్ ఎక్కువ. ఇదే కాకుండా కుండలో లభించే ఐస్‌క్రీం కూడా ఉంటుంది. పాతకాలం వస్తువులపైనే కాకుండా పాత కాలపు వంటలు అంబలి, రాగిసంకటి, సర్వపిండి, జొన్నరొట్టె వంటి పదార్థాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పాతకాలం నాటి సంప్రదాయ వంటకాలు ఎంతో రుచికరంగా ఉండేవి. ప్రస్తుతం వీటిని వినియోగించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇదే కాకుండా కట్టెలు, బొగ్గులపై వంట చేయడం, మట్టి పాత్రల్లో నాన్‌వెజ్ వండుతున్నారు. ప్రస్తుతం పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కుండ బిర్యానీ, చికెన్ ఫేమస్‌గా మారింది.
మట్టిపాత్రలు భేష్..
ఉత్తర భారత్‌లోని గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాలకు చెందిన మట్టి పాత్రలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. స్ఫూన్ దగ్గరి నుంచి అద్భుతమై కళా ఖండాల్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. టీ కప్పులు, కుక్కర్లు, ప్లాస్క్‌లు, వాటర్ బాటిల్స్, ప్లేట్లు, గృహ అలంకరణ వస్తువులు ఇలా ఎన్నో రకాల వస్తువులు మార్కెట్లలో లభిస్తున్నాయి. మట్టి పాత్రలో భోజనం చేస్తే మినరల్స్ మనకు పుష్కలంగా లభిస్తాయని పర్యావరణ వేత్తలు, వైద్యులు చెబుతున్నారు. మట్టి పాత్రల వినియోగంతో శరీరానికి మంచి ఆహారం లభించడంతో చర్మంతో పాటు అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయని, దీంతో శరీరంలో సమతుల్యతను తీసుకువస్తాయంటున్నారు. మట్టి పాత్రల వినియోగంతో రసాయనిక పదార్థాలు ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్లవు. ప్లాస్టిక్ వసువులలో తీసుకునే ఆహారంతో జుట్టు ఊడిపోతుంది. క్యా న్సర్ వంటి జబ్బులు వస్తాయి. ఇతర ఇబ్బందులు ఏర్పడతాయి. మట్టి పాత్రల వినియోగంతో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. ఆహారం రుచికరంగా ఉంటుంది.
మట్టి పాత్రల్లో వంట ఆరోగ్యదాయకం
మట్టిపాత్రలు, రాగిపాత్రలు వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. స్టీల్, అల్యూమీనియం పాత్రల్లో వంట చేయ డం ద్వారా వివిధ రకాల వ్యాధికారక క్రీములు అనారోగ్యానికి గురి చేస్తాయి. పూర్వం ఎక్కువగా మట్టిపాత్రలు, రాగి పాత్రలను వినియోగించేవారు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ వచ్చింది. మెల్లమెల్లగా అందరూ వీటివైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది మట్టిపాత్రలనే వాడుతున్నారు. గతంలో కేవలం ఎండాకాలంలో రంజన్లు, కుండల్లో నీరు తాగడానికి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారా యి. వంటచేయడానికి మట్టిపాత్రల ను వినియోగిస్తున్నారు. రోజురోజుకూ ఇలాంటి అలవాట్లు పెరగడంతో చాలా మంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతుండటంతో గిరాకీ పెరుగుతోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా వస్తువులను తయారు చేస్తున్నారు.