జహీరాబాద్, ఏప్రిల్ 2: మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో నాలుగు మైనార్టీ బాలుర గురుకుల కళాశాలలు, నాలుగు మైనార్టీ బాలికల గురుకుల కళాశాలలు నిర్మించాలని సంకల్పించింది. ఇందులో మొట్టమొదటిది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో మైనార్టీ జూనియర్ బాలుర కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యింది. 5 ఎకరాల్లో రూ. 18 కోట్లతో అత్యాధునికంగా భవనాలు నిర్మించారు. సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయం, క్రీడా మైదానం, పార్కు, జిమ్, వసతిగృహం, నమాజ్ కోసం ప్రత్యేక గది వంటి సౌకర్యాలు ఇందులో కల్పించారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే పరీక్ష ఆధారంగా ఈ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు కల్పించి మెరుగైన విద్యాబోధన చేస్తారు. నీట్, జేఈఈ, ఎన్డీఏ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణ అందిస్తారు.
జూన్ నుంచి కొత్త భవనంలో విద్యాబోధన చేసేందుకు మైనార్టీ గురుకుల సంస్థ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారికి ఇందులో ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం 8 మైనార్టీ గురుకుల కళాశాలలు ఏర్పాటు చేయగా, ఇందులో 4 బాలురు, 4 బాలికలకు కేటాయించింది. రాష్ట్రస్థాయిలో మొదటిది అల్గోల్లో భవనం పూర్తయ్యింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యాబోధన చేసేందుకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. మైనార్టీ గురుకుల కళాశాల చదివే విద్యార్థులకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కార్పొరేట్ సంస్థలో పనిచేసే వారు విద్యాబోధన చేస్తారని అధికారులు తెలిపారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సౌకర్యాలు కలిపించింది.
5 ఎకరాల్లో రూ. 18 కోట్లతో కళాశాల..
తెలంగాణ ప్రభుత్వం అల్గోల్లో రూ.18 కోట్లతో 5 ఎకరాల్లో జూనియర్ కళాశాల భవనం నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించేందుకు సిద్ధం చేసింది. సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయం, క్రీడా మైదానం, పార్కు, జిమ్, వసతిగృహం, నమాజ్ కోసం ప్రత్యేక గది నిర్మాణం చేశారు. యూనివర్సిటీ స్థాయిలో రాష్ట్రంలోనే తొలిసారిగా మైనార్టీ బాలుర కోసం మైనార్టీ విద్యాలయం ఏర్పాటు చేశారు. ఇంటర్లో ఉత్తమ బోధన చేసి జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఏర్పాటు చేశారు. కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ కోసం ప్రత్యేక భవనం నిర్మాణం చేశారు. మైనార్టీ గురుకుల భవనం అందరినీ ఆకట్టుకుంటున్నది.
పోటీ పరీక్షల కోసం శిక్షణ..
జాతీయస్థాయిలో నిర్వహించే నీట్, ఐఐటీ, ఎన్డీఏ పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో విద్యాబోధన చేసేందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కార్పొరేట్ కళాశాలలకు చెందిన అధ్యాపకులను నియమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ గురుకుల సంస్థ అధికారులు ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కళాశాలను జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో ముస్లిం మైనార్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.