నారాయణఖేడ్, అక్టోబర్ 30: ప్రతిభను చాటేందుకు ఏ వేదికైతేనేం పట్టుదల ఉండాలేగాని ఏ రంగంలో అయినా సత్తాచాటొచ్చు. గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉంటే చాలు పోటీ ఏస్థాయిలో ఉన్నా నెగ్గుకురావచ్చు. ఇదే సూత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన నేతి సాయికిరణ్. తెలుగు భాషపై ఉన్న అభిమానంతో వికీపీడియాను వేదికగా మలుచుకుని వంద రోజుల్లో వంద వ్యాసాలు రాసి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని, అంతర్జాతీయ స్థాయిలో 6వ స్థానంలో నిలిచాడు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఇంజినీరింగ్ పూర్తి చేసిన సాయికిరణ్.. అంతర్జాతీయంగా ప్రతిభను చాటడంపై రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయాలు, క్రీడలపై ఆసక్తికర రచనలు…
తెలుగు వికీపీడియాను వేదికగా ఎంచుకున్న సాయికిరణ్ ముఖ్యంగా రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వ్యాసాలను రాయడమే కాదు, ఆయా రచనలకు సంబంధించిన చిత్రాలను సైతం జోడించడం ద్వారా గుర్తింపు సాధించారు. 72 వేలకు పైగా వ్యాసాలతో అందుబాటులో ఉండే తెలుగు వికీపీడియాలో వివిధ అంశాలపై నిత్యం పలువురు వ్యాసాలు రాస్తుంటారు. అయితే, తన విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలనే జిజ్ఞాసతో సాయికిరణ్ వికీపీడియాలో అన్వేషిస్తున్న సమయంలో ఆయన దృష్టి ఈ వ్యాసాలపై పడింది. వికీపీడియాలో ఇంత సమాచారాన్ని చేరుస్తున్నది తనలాంటి వ్యాసకర్తలేనని తెలుసుకుని వికీపీడియా నిర్మాణంలో తానూ భాగం కావాలని ఆశించాడు. తన గురువులైన కృపాల్ కశ్యప్, యర్రా రామారావు తర్ఫీదుతో వికీపీడియాలో చిన్న చిన్న దిద్దుబాట్లను ప్రారంభించాడు. ఐదేండ్ల నుంచి 2వేల పైగా వ్యాసాలు రాసిన ప్రణయ్‌రాజ్ వంగరిని స్ఫూర్తిగా తీసుకుని గత జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున వ్యాసాల రచనను ప్రారంభించాడు. సెప్టెంబర్ 12వ తేదీ వరకు రోజుకో వ్యాసం చొప్పున వంద రోజుల్లో వంద వ్యాసాలను పూర్తి చేశాడు. ఈ ప్రస్థానంలో సాయికిరణ్ తనదైన ప్రత్యేకతను జోడించి వ్యాసాలకు చిత్రాలను సైతం చేర్చాడు. 2021 జూన్, ఆగస్టు నెలల్లో నిర్వహించిన వికీపీడియా పోటీల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా.. అంతర్జాతీయ స్థాయిలో 6వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
‘ఖేడ్’కు గుర్తింపు
వికీపీడియా వేదికగా నేతి సాయికిరణ్ సాధించిన ఘనత నారాయణ్‌ఖేడ్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని చెప్పాలి. సాధారణ కుటుంబంలో జన్మించి ఇంజినీరింగ్ పూర్తి చేసిన సాయికిరణ్లో ఏదైనా సాధించాలనే తపన ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కేలా చేసింది. తండ్రి నేతి రాంచందర్ టైలర్‌గా పనిచేస్తూనే కొడుకును ఉన్నత చదువులు చదివించాడు. ప్రస్తుతం నీతి అయోగ్ నిర్వహిస్తున్న ఆకాంక్ష కార్యక్రమంలో పిరమల్ ఫౌండేషన్ తరఫున గాంధీ ఫెలోగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాయికిరణ్ సేవలందిస్తున్నాడు.
భాషాభిమానంతోనే ఈ ఘనత..
తెలుగు భాషపై నాకున్న అభిమానమే ఈ అరుదైన ఘనత సాధించేందుకు కారణమైంది. తెలుగు భాషకు ప్రపంచ స్థాయిలో మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో నేను వికీపీడియాను వేదికగా చేసుకుని రాసిన రచనలు నాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టాయి. నేను నేర్చుకున్న విద్య సుస్థిర అభివృద్ధికి తోడ్పడాలనేదే నా అభిప్రాయం. ఆ దిశగా నా ప్రయత్నం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఆ సంకల్పాన్ని నా జీవిత లక్ష్యంగా భావిస్తా.