సంగారెడ్డి, కలెక్టరేట్/మెదక్, అక్టోబర్ 27: స్పెషల్ రివిజన్ సమ్మరీ రివిజన్ 2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో మెదక్, సంగారెడ్డి కలెక్టర్లతో ఎస్ఎస్ఆర్ 2022పై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 30 వరకు వచ్చిన ఓటర్ల నమోదు, తొలిగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి నవంబర్ 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని సూచించారు. ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. ఓటరు జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు, ఫొటో లేకపోవడం తదితర సమస్యలు ఉంటే ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 2వ తేదీ నుంచి సరిదిద్దే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఓటర్ల అభ్యంతరాలను సవరించి జనవరి 2022న తుది ఓటరు జాబితాను ప్రచురించాలని కలెక్టర్లకు సూచించారు. అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మార్చడం తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆమోదంతో సిఫారసు చేయవచ్చన్నారు. ఈవీఏం గోడౌన్ల నిర్మాణం ఇంకా పూర్తి చేయని జిల్లాల్లో త్వరగా పూర్తి చేయాలని శశాంక్ గోయల్ ఆదేశించారు. స్వీప్ యాక్టివిటీలను నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లాలో అందిన 2,934 దరఖాస్తులు
జిల్లాలో 6, 6ఎ, 7, 8, 8ఎ లకు సంబంధించి 2,934 దరఖాస్తులు అందాయని కలెక్టర్ హనుమంతరావు ఎన్నికల ప్రధానాధికారికి వివరించారు. 1955 దరఖాస్తులను పరిశీలించినట్లు చెప్పారు. నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
గరుడ యాప్‌పై శిక్షణ : మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్
బ్లాక్ స్థాయి అధికారులకు గరుడ యాప్‌పై శిక్షణ ఇచ్చామని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ద్వారా ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తామని, జిల్లాలో ఓటరు నమోదుకు, పేర్ల మార్పుకు వచ్చిన దరఖాస్తులు అన్ని పరిష్కరించి నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నవంబర్ 6,7 తేదీల్లో తిరిగి 13, 14 తేదీల్లో ఓటరు నమోదు, మార్పు, చేర్పులపై దరఖాస్తులు స్వీకరించి 2022 జనవరి 5 నాటికి తుది జాబితా రూపొందిస్తామని తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి ఆర్డీవో నగేశ్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్లు వెంకటేశ్వర్లు, ఉమర్ పాషా, ఎన్నికల సెల్ డిప్యూటీ తహసీల్దార్లు, ఆపరేటర్లు, మెదక్ ఆర్డీవో సాయిరాం, ఎన్నికల సూపరింటెండెంట్ శైలేందర్ పాల్గొన్నారు.