సంగారెడ్డి, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ)/కొండాపూర్ : న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందాలనుకునే గ్రామీణ, పేద ప్రజలకు న్యాయసేవాధికార సంస్థలు వేదికలు కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ పంక్షన్హాల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఉజ్జల్ భూయాన్, టి.వినోద్‌కుమార్, షమీమ్ అక్తర్, అభిషేక్‌రెడ్డి, జి.శ్రీదేవితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత న్యాయసేవ గురించి పేదలకు, గ్రామీణులకు అవగాహన లేకపోవడంతో న్యాయసేవాధికార సంస్థలను ఆశ్రయించడం లేదన్నారు. వీటిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా ప్రజల్లో కల్పిస్తే ఆదరణ లభిస్తుందన్నారు. ఉచిత న్యాయసహాయాన్ని న్యాయసేవాధికార సంస్థ ద్వారా పేదలకు అందజేసేందుకు న్యాయవాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు ఇతర కేసుల్లో ఎలా వందశాతం పనిచేస్తున్నారో, అలాగే న్యాయసేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయసేవలు అందజేయాలని ఆకాంక్షించారు. న్యాయవాదులు, పారాలీగల్ వలంటీర్లు గ్రామాల్లో పర్యటించి ఉచిత న్యాయసేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే నాణ్యమైన ఉచిత విద్య, మహిళా సాధికారత ముఖ్యమన్నారు. తెలంగాణ న్యాయసేవాధికా సంస్థ సేవలను తెలియజేస్తూ రూపొందించిన థీమ్ సాంగ్ వీడియోలో తనకు రెండు అంశాలు నచ్చినట్లు చెప్పారు. కక్షిదారు న్యాయవాదికి డబ్బులు ఇవ్వబోతుండగా, పారాలీగల్ వలంటీరు వచ్చి కక్షిదారుడికి డబ్బులు తిరిగి ఇప్పించి ఉచిత న్యాయసేవలు పొందేందుకు న్యాయసేవాధికార సంస్థ వద్దకు తీసుకెళ్లడం నచ్చినట్లు చెప్పారు. వీడియోలో యాసిడ్ బాధితురాలకి సహాయం అందజేయడం నచ్చినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ తెలంగాణలో న్యాయసేవాధికార సంస్థ పనితీరు గురించి, అందజేస్తున్న ఉచిత న్యాయసేవల గురించి వివరించారు. జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు ప్రారంభంలో న్యాయసేవాధికార సంస్థ తెలుగులో ముద్రించిన పుస్తకాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, రాష్ట్ర హైకోర్ట ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ రేణుక, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ రమణకుమార్, ఆదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి జిల్లా అధికారులు, న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వశాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జడ్జిలు తిలకించారు. దివ్యాంగుల సంక్షేమశాఖ ద్వారా రూ.15.16 లక్షలు విలువగల రెట్రో ఫిట్టెడ్ స్కూటీలర, అంధ విద్యార్థులకు రూ.1.20లక్షల విలువ చేసే మూడు ల్యాప్‌టాప్‌లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణాల చెక్కులను లబ్ధిదారులకు జడ్జిలు అందజేశారు.