మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సంగారెడ్డి జిల్లా ప్రజల ఆశలు మరికొద్ది నెలల్లో నెరవేరనున్నాయి. వచ్చే ఏడాది జూన్‌లో మొదటి సంవత్సర తరగతులు ప్రారంభించడమే లక్ష్యంగా వేగంగా మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల రూ.30 కోట్లు కేటాయించడంతో ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థులకు వీలుగా 90వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో అన్ని వసతులతో విశాలమైన భవన నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం బేస్మెంట్ పనులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు పూర్తిచేసేందుకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. మెడికల్ కళాశాల అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో మెరుగైన వైద్యం అందనున్నది. స్థానికులకు వైద్యవిద్య అందుబాటులోకి రానున్నది.
సంగారెడ్డి, అక్టోబరు 24: జిల్లాకేంద్రమైన సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటుకు తొలి అడుగులు పడుతున్నాయి. ప్రథమ సంవత్సరం తరగతుల నిర్వహించేందుకు భవన నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. దీంతో త్వరలోనే వైద్యవిద్య అభ్యసించేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థుల కలలు సాకారం కానున్నాయి. సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు పూర్తిస్థాయి పక్కా భవన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. వైద్య కళాశాల, దవాఖానలో విధులు నిర్వహించే నర్సుల కోసం ప్రత్యేకంగా కళాశాల, వసతి గృహానికి రూ.40 కోట్లను సీఎం కేసీఆర్ కేటాయించారు. ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థులకు వీలుగా 90వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో విశాలవంతమైన భవన నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి స్థలాన్ని చదును చేస్తున్నారు. నిర్మాణ పనులను యంత్రాలతో అధికారులు కొనసాగిస్తున్నారు. వచ్చే జూన్ నాటికి ప్రథమ సంవత్సర మెడికల్ విద్యార్థులకు పూర్తిస్థాయి భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన పేద విద్యార్థులకు వైద్య విద్య అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాలను ప్రకటించిన కొద్ది సమయంలోనే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాతో పాటు సరిహద్దు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర విద్యార్థులు వైద్య విద్యనభ్యసించే అవకాశం కల్పించనున్నది. సంగారెడ్డితో పాటు చుట్టుపక్కల జిల్లాల రోగులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.
మూడు అంతస్తుల్లో భవన నిర్మాణం…
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలోని 35ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాల భవనాల నిర్మాణం జరుగనున్నది. మూడు అంతస్తుల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు చదువు, ల్యాబ్ పరీక్షలు నిర్వహించే విధంగా గదులను తీర్చిదిద్దనున్నారు. గ్రౌండ్ ఫ్ల్లోర్లో విద్యార్థుల కోసం క్యాంటీన్హాల్, వివిధ రకాల రెండు ల్యాబ్స్, రీడింగ్ రూమ్స్, ఫ్యాకల్టీ గదులను ఏర్పాటు చేయనున్నారు. మొదటి అంతస్తులో ప్రథమ సంవత్సరం విద్యాబోధన తరగతి గదులు, అధ్యాపకులు, ఫ్యాకల్టీల గదులు ఉండనున్నాయి. రెండో అంతస్తులో సెంట్రల్ లైబ్రరీహాల్, బోధన, రీడింగ్ గదులు, విశాలమైన మల్టీపర్పస్హాల్, బయో కెమిస్ట్రీ ల్యాబ్, క్లీనికల్ ల్యాబ్, అనాటమీ ల్యాబ్, ఇస్తాలాజీ ల్యాబ్ గదులు ఉంటాయి. ప్రభుత్వం ఆర్థిక స్థోమతలేని కుటుంబాల విద్యార్థులకు వైద్య విద్యనందించే క్రమంలో జిల్లా కేంద్ర దవాఖాన ప్రాంగణంలో ఏర్పాటు కానున్న కళాశాలతో పట్టణానికి నూతన శోభ సంతరించుకోనున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా కేంద్రంగా సుదీర్ఘకాలం పాటు ప్రజలకు అధికార, అనధికార సేవలకు నిలయంగా నిలిచిన సంగారెడ్డి, ఇక నుంచి వైద్య విద్యార్థులతో నిత్యం కళకళలాడనున్నది. వైద్య కళాశాల భవన నమూనా చిత్రాన్ని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. దాని ప్రకారం రోడ్లు, భవనాల ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు తయారు చేసి పనులు ప్రారంభించారు. ఇప్పటికి ఉస్మానియా మెడికల్ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది వైద్యులుగా ఎదిగి సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, భవిష్యత్‌లో సంగారెడ్డి మెడికల్ కళాశాలలో చదువుకున్న వైద్య విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగి పేదలకు సేవలందించనున్నారు.
గడువులోగా పూర్తిచేస్తాం..
ప్రభుత్వం ఆదేశాల మేరకు కళాశాల భవన నిర్మాణ పనులు గడువులోగా పూర్త్తిచేస్తాం. జూన్ నాటికి పూర్తిస్థాయిలో భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రథమ సంవత్సర తరగతుల నిర్వహణకు అందజేస్తాం. ప్రస్తుతం పునాది పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఖర్చు చేస్తూ అనుకున్న సమయానికి భవనం సిద్ధం చేస్తాం. మా శాఖకు అప్పగించిన మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. నాణ్యతతో పనులు చేపడతాం.