పటాన్చెరు, నవంబర్ 18 : హైదరాబాద్ చుట్టుపక్కల సరుకు రవాణాకు ఇన్లాండ్ పోర్ట్‌ను నిర్మించే యోచనలో దుబాయ్‌కు చెందిన బహుళజాతి లాజిస్టిక్ కంపెనీ ‘డీపీ వరల్డ్’ ఉన్నదని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) అధ్యక్షుడు కె.భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 60 పెద్ద ఓడరేవులున్నాయని, త్వరలో అది ఇక్కడ సాకారం కావొచ్చని పేర్కొన్నారు. గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్లో ఆపరేషన్స్ అండ్ సప్లయ్ చైన్ ఆధ్వర్యంలో ‘లాజిస్టిక్స్ రంగం, అందులో పెరుగుతున్న కెరీర్ అవకాశాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న ఒకరోజు అంతర్జాతీయ చర్చాగోష్ఠిని గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. లాజిస్టిక్స్ రంగంలో అపూర్వ వృద్ధి నమోదవుతోందని, మనదేశంలో అధికసంఖ్యలో ఉద్యోగాలు కల్పించే రంగాల్లో ఇదొకటిగా నిలిచిందన్నారు. ప్రధాని ప్రవేశపెట్టిన ‘గతిశక్తి’ పథకం ఈ రంగానికి పెద్ద వరమన్నారు. విద్యార్థులు సొంతంగా పరిశోధనలు చేపట్టడంతో పాటు ఇంటర్న్‌షిప్‌లు చేస్తే ఈ రంగంపై మంచి అవగాహన ఏర్పడుతుందని సూచించారు. ఎంతో ఆశావహంగా ఉన్న ఈ రంగానికి కృత్రిమ మేథా, రోబోటిక్స్ వంటి అత్యాధునిక పరిజ్ఞానం తోడైతే మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని భాస్కర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ శివప్రసాద్ మాట్లాడారు. 1981 నుంచి లాజిస్టిక్స్ రంగం ఎదుగుదల, సాధిస్తున్న ప్రగతిని గుర్తు చేశారు. మనదేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో లాజిస్టిక్స్ రంగానికి 12శాతం వాటా ఉన్నదని, 18శాతం వృద్ధితో ఆ రంగం ముందుకు వెళ్తున్నదన్నారు. చెన్నైలోని లాజిస్టిక్స్ నైపుణ్య మండలి సీఈవో కెప్టెన్ రామానుజన్ లాజిస్టిక్స్ రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎల్ఎస్సీ సంస్థ అధిపతి ప్రొఫెసర్ ఎస్ గణేశన్, డెల్లాయిట్కు చెందిన టెక్నాలజీ కన్సల్టింగ్ డైరెక్టర్ సందీప్ చటర్జీ, జీఎంఆర్ ఎయిర్ కార్గో సీఈవో సౌరభ్‌కుమార్, ఐఎల్ఎస్ దక్షిణాసియా డైరెక్టర్ విపిన్ శంకర్, బెల్జియంలోని పోర్టు ప్రాజెక్టు మేనేజర్ కొయిన్ కొర్నెల్గీ, ఐఎస్బీ సీనియర్ డీన్ ప్రొఫెసర్ చందన్, షార్జాలోని స్కైలెన్ యూనివర్సిటీ డీన్ వై.రామకృష్ణ తదితరులు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ప్రొఫెసర్ దేబాషిశ్ ముఖర్జీ, కార్యక్రమ నిర్వాహకుడిగా ఫక్రుద్దీన్ షేక్ వందన సమర్పణ చేశారు.