సంగారెడ్డి అర్బన్, నవంబర్ 17 : గంజాయి, గుట్కాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ రమణకుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగ్ కేసులపై నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజా యి, గుట్కా, మట్కా, పేకాట వంటి వాటిని ఎస్‌హెచ్‌వోలు తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీటికి బానిసైన వ్యక్తులు పరిస్థితులను బట్టి నేరం చేయడానికి సిద్ధమవుతాడని, జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైనా కేసుల్లో గంజాయి దొరికితే దానిని వీలైనంత త్వరగా కోర్టులో డిపాజిట్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో పోలీస్‌స్టేషన్‌లో ఉంచరాదన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగకుండా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహించాలని సూచించారు. పోస్కో కేసులు నమోదయితే తప్పనిసరిగా 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. దవాఖానల్లో చికిత్స పొందుతూ మరణించిన కొన్ని సందర్భాల్లో మృతుడి బంధువులు డాక్టర్లపై దాడులు చేస్తుంటారని, ఇలాంటివి జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీలు సత్యనారాయణరాజు, శంకర్రాజు, భీంరెడ్డి, బాలాజీ, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు, డీసీఆర్బీ సీఐ రామకృష్ణారెడ్డి, అన్ని సబ్ డివిజన్ల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.