పోడు భూముల సమస్య పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. 2005 కంటే ముందు నుంచి కబ్జాలో ఉన్న గిరిజనులు, గిరిజనేతరుల రైతులకు రెవెన్యూ వర్గాల నుంచి అధికారికంగా పట్టాలు పొందిన గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నది. కాగా, పోడు పట్టాల కోసం దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ముగిసింది. సంగారెడ్డి జిల్లాలో 3934 దరఖాస్తులు రాగా, మెదక్లో 2913 దరఖాస్తులు వచ్చాయి. త్వరలోనే అధికారులు ఈ అర్జీలను పరిశీలించి, గ్రామాల వారీగా సర్వే చేయనున్నారు. సర్వేలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. సర్వే నిర్వహణపై ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేస్తుందని గిరిజన శాఖ అధికారులు చెబుతున్నారు.
సంగారెడ్డి నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఏండ్లుగా పోడుభూములను సాగు చేస్తున్న వారికి భూ యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. అటవీ ప్రాంతాల్లో భూములను సాగు చేస్తూ జీవ నం సాగిస్తున్న గిరిజనులకు వాటిపై హక్కులు కల్పించి భరోసా ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ సం కల్పం. అందుకు అనుగుణంగా పోడుభూములు సాగు చేస్తున్న వారి నుంచి గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అధికారులు అర్జీలు స్వీకరించగా, మంగళవారం గడువు ముగిసింది. డిసెంబర్ 2005 నుంచి పోడుభూములను సాగు చేస్తున్నవారికి భూ యాజమాన్య హక్కులు కల్పిం చే అవకాశం ఉంది. దీంతో పోడుభూములు సాగు చేస్తున్న వారిని రెవెన్యూ, అటవీ, గిరిజనశాఖ అధికారులు త్వరలో గుర్తించి ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో గిరిజనులు పోడు భూములను సాగు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పోడుభూములు సాగు చేస్తున్న గిరిజనులు భూ యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వా నికి పలు సందర్భాల్లో విన్నవించారు. సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా అమలు చేయడంతో పోడు రైతులు తమకూ పట్టాలు ఇచ్చి రైతుబంధు, రైతుబీమా వర్తింపజేయాలని డిమాం డ్ చేస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్ పోడుభూములు సాగు చేస్తున్న గిరిజనులకు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పోడుభూములు సాగు చేస్తున్న వారికి భూ యాజమాన్య హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు ఈ నెల 7వ తేదీ నుంచి సంగారెడ్డి జిల్లాలో పోడుభూములు సాగు అవుతున్న 37 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించారు. జిల్లాలో పోడు భూములపై వచ్చిన మొత్తం దరఖాస్తులు 3934, సాగు విస్తీర్ణం 7009.24 ఎకరాలు కాగా, గిరిజనుల దరఖాస్తులు 2168, సాగు విస్తీర్ణం 4129 ఎకరాలు, గిరిజనేతరుల దరఖాస్తులు 1766, సాగువిస్తీర్ణం 2980 ఎకరాలుగా ఉంది. సంగారెడ్డి జిల్లాలో 37 గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే పోడుభూములను సాగు చేస్తున్నవారు ఉన్నారు. నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో ఎక్కువగా పోడుభూములు సాగు చేస్తున్నారు. 37 గ్రామాల్లోని 2958 ఎకరాల్లో గిరిజనులు పోడుభూములు సాగు చేస్తున్నట్లు అంచనా. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మండలంలోని నారాయణపేట, కల్హేర్ మండలంలోని ఇంద్రానగర్, కృష్ణాపూర్, నాగ్ధర్, రామచంద్రనాయక్తండా, మునిగేపల్లి, బీబీపేట, జెమ్లానాయక్తండా,మొదళ్లకుంటతండా, మార్థి, ఖానాపూర్(కె), బాచేపల్లి, నాగోనికుంట తం డాల్లో పోడుభూములను గిరిజనులు సాగు చేస్తున్నారు. హత్నూర మండలంలోని శేర్ఖాన్పల్లి, గుండ్లమాచునూరు, చింతలచెర్వు, రొయ్యపల్లి, కోనాపేట్, జిన్నారం మండలంలోని కొడకంచి, వట్పల్లి మండలంలోని మం చిర్యాలతండా, మొగుడంపల్లి మండలంలోని చున్నంబట్టితండా, ఔరంగనగర్, గౌసాబాద్ తం డా, విట్టునాయక్తడా, పాడియాల్ తండా, హరిచంద్రనాయక్తండా, సర్జారావుపేట తండా, గౌసాతబాద్, జంగరిబౌలితండా, జహీరాబాద్ మండలంలోని ఆనెగుంట, లచ్చునాయక్తండా, దిడ్గి, ఆల్గోల్, మల్చెల్మ, మల్చెల్మ తండా, రాయిపల్లి, ఝరాసంగం మండలంలోని బర్డిపూర్, చిలేపల్లి, బిడకన్నె, కోహీర్ మండలంలోని గొడ్గార్పల్లి, సజ్జాపూర్, పర్శపల్లి, పిచేరాగడి తండా, బడంపేట, సిర్గాపూర్ మండలంలోని సుల్తానాబాద్, గోసాయిపల్లి, ఖాజాపూర్లో గిరిజనులు పోడుభూములను సాగు చేస్తున్నారు. గ్రామాల్లో రెవెన్యూ, అట వీ, గిరిజనశాఖ అధికారులు గ్రామసభలు నిర్వహించి అర్జీలు స్వీకరించారు. త్వరలోనే అర్జీలను పరిశీలించి గ్రామాల వారీగా సర్వే చేయనున్నారు. సర్వేలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్హులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.
ముగిసిన పోడు దరఖాస్తుల స్వీకరణ
మెదక్, నవంబర్ 16 : పోడు భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. 2005 కంటే ముందు నుంచి కబ్జాలో ఉన్న గిరిజనులు, గిరిజనేతరుల రైతులకు రెవెన్యూ వర్గాల నుంచి అధికారికంగా పట్టాలు పొందిన గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 75 ఏండ్లుగా ఆ భూమిని నమ్ముకొని జీవించే వారికి అనుభవించే హక్కు కల్పించే విధంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి జిల్లాల వారీగా పరిశీలించి నివేదికలు తయారు చేశారు. నవంబర్ 8 నుంచి 16వ తేదీ వరకు పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు.
సాగులో ఉన్న వారికే…
మెదక్ జిల్లాలో 6.80 లక్షల ఎకరాల విస్తీర్ణం కాగా, ఇందులో 6871 ఎకరాల్లో పోడు భూ ములు ఉండగా, 3269 మంది రైతులు పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. జిల్లాలో 21 మండలాలు ఉండగా, అందులో 17 మండలాల్లో గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూములను సాగు చేస్తూ జీవిస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలు పర్యటించి సాగు రైతుల వివరాలను సేకరిస్తున్నారు. వారికి త్వర లో హక్కు పత్రాలు ఇవ్వనున్నారు. జిల్లాలో ఈ నెల 16వతేదీ వరకు 2913 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఎస్టీలు 894 మంది, 2019 మంది ఎస్సీలు, బీసీలు, ఇతరులు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎస్టీలకు 1374.28 ఎకరాలు, ఎస్సీ, బీసీ, ఇతరులకు 3261.26 ఎకరాలు మొత్తం 4637.34ఎకరాల్లో దరఖాస్తులు చేసుకున్నారు.
డిసెంబర్ 8 తర్వాత అర్హుల గుర్తింపు..
డిసెంబర్ 8 తర్వాత అటవీ శాఖ రికార్డులు, రెవెన్యూ రికార్డులను అనుసరించి అటవీశాక, రెవెన్యూశాఖ అధికారులు, మండల స్థాయి, డివిజన్ స్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఇందులో అర్హులు, అనర్హుల జాబితా తయారు చేసి కలెక్టర్కు సమర్పిస్తారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన ఆర్డీవో, డీఎఫ్వో, సంబంధిత అధికారులు సమీక్షించి అర్హులను గుర్తించి తుది జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు.