రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి సాగు, అమ్మకాలు, స్మగ్లింగ్‌పై ఎక్సైజ్, పోలీసు శాఖలు ఉక్కుపాదం మోపుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో గంజాయి స్మగ్లర్ల మత్తు వదిలేలా చర్యలు తీసుకుంటున్నాయి. విక్రేతలపై నిఘా పెంచుతూ వారి కదలికలను పసిగడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా గంజాయి ఏయే ప్రాంతాల్లో విక్రయిస్తున్నారో హాట్ స్పాట్లు గుర్తించారు. కళాశాలల వద్ద టాస్క్‌ఫోర్స్ సహకారంతో విక్రయాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ గంజాయి సాగుపై దాడులు నిర్వహిస్తూ, రైతులకు సాగు చేపట్టవద్దని అవగాహన కల్పిస్తున్నారు.
సంగారెడ్డి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): గంజాయి సాగు, అమ్మకాలకు, స్మగ్లింగ్‌కు చెక్ పెట్టేందుకు ఎక్సైజ్, పోలీసు శాఖలు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. జిల్లాలో గంజాయిపై రెండు శాఖలు యుద్ధం ప్రారంభించాయి. గంజాయి సాగును అడ్డుకునేందుకు రెవెన్యూ, ఎక్సైజ్‌శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. సరఫరా, విక్రయాలను అడ్డుకునేందుకు వరుసగా దాడులు చేస్తున్నాయి. గంజాయి డీలర్లు, విక్రేతలను పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరైనా రైతులు గంజాయి సాగు చేస్తే రైతుబంధు, రైతుబీమా తొలగిస్తామని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు, కానిస్టేబుళ్లు తమకు కేటాయించిన గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలతో కలిసి సందర్శించనున్నారు. గ్రామంలో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నారా అని ఆరా తీస్తూనే, సాగు చేస్తున్నట్లు గుర్తించిన గంజాయి మొక్కలను ధ్వంసం చేసి రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి గంజాయి సాగు చేయవద్దని అవగాహన కల్పిస్తున్నారు.
గంజాయి విక్రేతలపై నిఘా, హాట్ స్పాట్ల గుర్తింపు
గంజాయి విక్రేతలు(పెడ్లర్ల)పై పోలీసు, ఎక్సైజ్ శాఖలు నిఘా ముమ్మరం చేశాయి. గంజాయి రవా ణా, అమ్మకాలను అరికట్టేందుకు ఆ రెండు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. పోలీసుశాఖ గం జాయి రవాణా, అమ్మకాలకు సంబంధించిన ఇంటలిజెన్స్‌ను ఎక్సైజ్‌శాఖతో పంచుకుంటుంది. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి ఇటీవల సమావేశమై గంజాయి రవాణా, అమ్మకాలు అరికట్టేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తున్నది. ఆ యాక్షన్ ప్లాన్ ను అనుసరించి పోలీసుశాఖ సిబ్బంది గంజాయి స్మగ్లర్లు, విక్రేతల కదలికలపై నిఘా వేశారు. ఆంధ్ర, ఓడిశా సరిహద్దు(ఏఓబీ) నుంచి వాహనాల్లో గంజాయిని సంగారెడ్డి జిల్లాలోకి కూరగాయలు ఇతర వాహనాల ద్వారా తీసుకువస్తున్నట్లు గుర్తించారు. దీంతో ప్రధాన రహదారులపై రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. గంజాయి అమ్మకాలకు సంబంధించిన హాట్స్పాట్లను అధికారులు గుర్తిస్తున్నారు. పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పెడ్లర్లు గంజాయిని ఏయే ప్రాంతాల్లో అమ్ముతున్నది గుర్తించి ఆయా ప్రాంతాలపై నిఘా వేశారు. పటాన్చెరు వద్ద ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతంలోని ఓ హాటల్ కేంద్రంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించి ఎక్సైజ్‌శాఖ అధికారులు ఆ హాటల్‌పై నిఘా వేసినట్లు తెలుస్తోంది. బొల్లారం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పెద్ద మొత్తంలో గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించి అతని కదలికలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. పటాన్చెరు ప్రాంతంలో పనిచేసే ఉత్తర భారతదేశానికి చెందిన కార్మికులు ఎక్కువగా గంజాయికి అలవాటు పడ్డారు. దీనిని గంజాయి విక్రేతలు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని గుర్తించి పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులు పటాన్‌చెరుల్లో గంజాయి స్మగ్లర్లు, పెడ్లర్ల నెట్‌వర్క్‌ను దెబ్బకొట్టేందదుకు సిద్ధమవుతున్నారు. యువతను టార్గెట్ చేసుకుని గంజాయి అమ్మకాలు ఎక్కువగా సాగుతున్న నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ కళాశాలలపై నిఘా వేసింది. టాస్క్పోర్సుకు చెందిన సిబ్బంది కళాశాలల వద్ద పాగా వేసి గంజాయి అమ్మకాలపై ఆరా తీస్తున్నారు.
గంజాయిని అంతమొందిస్తాం..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో గంజాయి సాగు, అమ్మకాలపై పూర్తిగా అంతమొందిస్తాం. ఇందుకోసం కార్యాచరణ రూపొందించి అందుకుఅనుగుణంగా టాస్క్ఫోర్సు ద్వారా దాడులు జరుపుతున్నాం. గంజాయిని రూపుమాపేందుకు పోలీసుశాఖ సహాయం తీసుకుంటున్నాం. గంజాయి స్మగ్లర్లు, విక్రేతల కదలికలపై నిఘా పెట్టాం. ఎక్కడ గంజాయి సాగు, అమ్మకాలు జరిగినా ఎక్సైజ్ టాస్క్ఫోర్సు బృందాలు దాడు లు చేసి పట్టుకుంటున్నాయి. త్వరలో పోలీసుశాఖతో కలిసి మరిన్ని దాడులు నిర్వహిస్తాం.