సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 7 : ప్రజలకు హక్కులు కల్పించడానికే ప్రభుత్వం పోడు భూముల చట్టం తీసుసువస్తున్నదని శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల మేలు కోసమే క్యాబినేట్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. పోడు భూములు, అటవీ భూముల సంరక్షణపై ఆదివారం సాయంత్రం సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొటెం స్పీకర్ మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అటవీ భూములను సంరక్షించాలని సూచించారు. సాగు చేసుకుంటున్న అర్హులైన ప్రజలకు న్యాయం జరుగనున్నదని ఆయన ఆకాంక్షించారు.
సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ..
ఈ నెల 8 నుంచి గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి దరఖాస్తులను స్వీకరిస్తామని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. ప్రభుత్వం పకడ్భందీగా పోడు భూముల సంరక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. 2005 సంవత్సరానికి ముందు ఎవరైతే సంబంధిత భూములను సాగు చేసుకుంటున్నారో వారికే హక్కులు కల్పించబడుతుందని స్పష్టం చేశారు. గతంలోనూ ప్రభుత్వాలు అవకాశం కల్పించినా అవగాహనా లోపంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని గుర్తుచేశారు. మారుమూల తండాల ప్రజలు అకారణంగా హక్కులు కోల్పోయినందున ఈసారి వారికి న్యాయం జరుగాలన్నారు. అవసరమైతే గ్రామ పంచాయతీలకు పిలిపించుకొని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని వివరించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారులు బృందంగా ఏర్పడి జిల్లాలో పోడు, అటవీ భూముల సంరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజలకు న్యాయం జరుగాలి..
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన పోడు, అటవీ భూముల సంరక్షణ చట్టం ద్వారా ప్రజలందరికీ న్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలోనూ హక్కులు దక్కించుకోలేని ప్రజలందరికీ ఈసారి హక్కులు కల్పించబడుతాయని ఆకాంక్షించారు. కొందరికీ ఒక ఎకరా భూమి ఉంటే, మరి కొందరికీ 20 ఎకరాల భూమి కూడా ఉన్నదని, వారందరికీ ఏవిధంగా న్యాయం చేస్తారో అనే ఆందోళన చెందకూడదని, ప్రజలకు న్యాయం జరిగేలా నిర్ణయం ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా ఎస్పీ, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.