వడ్ల కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కేంద్రం నిరాకరించినా నేనున్నానంటూ సీఎం కేసీఆర్ అన్నదాతలకు భరోసానిస్తూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. సాధ్యమైనంత వరకు రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పడంతో మెతుకుసీమ యంత్రాంగం రంగంలోకి దిగింది. నిర్దేశిత లక్ష్యం మేరకు వడ్లను కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. సంగారెడ్డి జిల్లాలో 2 లక్షలు, మెదక్ జిల్లాలో 5.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ వానకాలంలో సంగారెడ్డి జిల్లాలో 1,10,268 ఎకరాల్లో , మెదక్ జిల్లాలో 2.56 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగుచేశారు. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన గురయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే భరోసా కల్పిస్తూ కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ)/ మెదక్: అన్నదాతకు దన్నుగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు నిరాకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాన కాలంలో వందశాతం వడ్ల కొనుగోలుకు ప్రాధా న్యం ఇస్తున్నది. రైతు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని ఆదేశించడంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వాన కాలంలో పండించిన వడ్ల కొనుగోళ్లు ప్రారంభించారు. పంట కొనుగోళ్ల లక్ష్యం మేరకు ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశారు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బస్తాలు, లారీలను సిద్ధం చేసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల నిర్వాహకులు ధాన్యం, తేమ శాతం, తాలు శాతం వంటివి పరిశీలిస్తున్నారు. నాణ్యతతో ధాన్యం ఉందని నిర్ధారించిన తర్వాత కొనుగోలు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 1,10,268 ఎకరాల్లో వరి సాగు..
2021 వాన కాలంలో సంగారెడ్డి జిల్లాలోని 79,000 మంది రైతులు 1,10,268 ఎకరాల్లో వరి సాగు చేశారు. యాసంగి సీజన్లో 2,45,536 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు రైతుల నుంచి 2271 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల విత్తనాలు అవసరాలు, బహిరంగ మార్కెట్లో అమ్మకాలు మినహాయించి మొత్తం 153 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది.
153 కొనుగోలు కేంద్రాలు..
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 153 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఐకేపీ ద్వారా 79 కొనుగోలు కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 59 కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, ఇప్పటి వరకు 134 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కాగా, ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 363 మంది రైతుల నుంచి 2271 టన్నుల ధాన్యం సేకరించారు. అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడీక్లీనర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచారు. ధాన్యం సేకరణ కోసం 49,10,725 గన్నీ సంచులు అవసరం కాగా, ఇప్పటి వరకు 31,48,801 గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులు చేర్చేలా అధికారులు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 363 మంది రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి రూ.4.45 కోట్ల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
మెదక్ జిల్లాలో 2.56 లక్షల ఎకరాల్లో..
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ యేడు పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఘనపూర్ ప్రాజెక్టు, పోచారం, రాయిన్‌పల్లి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. భూగర్భ జలాలు పెరగడంతో రైతులు పెద్ద మొత్తంలో పంటను సాగు చేశారు. ఈ వాన కాలంలో 1,77,404 మంది రైతులు 2,56,813 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 311 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 105 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
అందుబాటులో 40 లక్షల గన్నీ బస్తాలు…
జిల్లాలో 5.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కోటి 50 లక్షల గన్నీ బస్తాలు కావాల్సి ఉండగా, 40 లక్షల బస్తాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇంకా 60 లక్షల గన్నీ బస్తాలను తెప్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వానకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధరను పెంచుతూ వస్త్తుంది. క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 అందజేస్తున్నది.
రైతులకు ఇబ్బందులు రానివ్వం..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాన కాలానికి సంబంధించి రైతులు పండించిన ధా న్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లాలో వాన కాలంలో పండించిన పంటను 153 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిమాండ్‌ను అనుసరించి మరికొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కేంద్రాలకు వచ్చే ముందు రైతులు ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టుకుని రావాలి.
దళారులను నమ్మొద్దు..
జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొంటాం. జిల్లాలో 311 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుత సీజన్లో 5.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం. గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచుతాం. రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలి.