పటాన్చెరు, డిసెంబర్ 2 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గురుకుల పాఠశాలలో కరోనా కేసులు కలకలం సృష్టించాయి. జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో గురువారం 27 కరోనా కేసులు నమోదయ్యాయి. పాఠశాలలో 1120 మంది విద్యార్థినులు 5 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. రెండు రోజుల క్రితం విద్యార్థినికి జ్వరం తగ్గక పోవడంతో పరీక్షలు చేశారు. పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో 300 మంది విద్యార్థినులకు, 54 మంది స్టాఫ్‌కు వైద్యశాఖ అధికారులు పరీక్షలు చేయించారు. 27 మంది విద్యార్థినులకు గురువారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. విష యం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిణి గాయత్రి పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పాజిటివ్ వచ్చిన 10 మంది విద్యార్థులకు ఎలాం టి లక్షణాలు లేవు. ఏడుగురికి జలుబు మాత్రమే ఉంది. మిగిలిన వారిలో స్వల్ప జ్వరం ఉంది. పాజిటివ్ వచ్చిన విద్యార్థినులకు కరోనా చికిత్స కిట్లు, మందులు అంద జేశారు. విద్యార్థినులు భయపడొద్దని డీఎంహెచ్‌వో ధైర్యం చెప్పారు. ముగ్గురు స్టాఫ్ నర్సులు విద్యార్థినులకు సేవలందిస్తున్నారు. డాక్టర్ల బృందం ప్రత్యేక సేవలు అందిస్తున్నది. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి తమ పిల్లలను ఇంటికి పంపాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులతో ప్రిన్సిపాల్ సత్యనాథ్‌రెడ్డి మాట్లాడారు. పిల్లలను పాఠశాలలోనే ఉంచాలని, మెరుగైన వైద్యం, పూర్తి భద్రత కల్పిస్తామని భరోసానిచ్చారు. కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను ఇండ్ల్లకు తీసుకెళ్లారు. పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది గురుకులంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ మధ్య కాలంలో 5,6 తరగతులకు కొత్తగా విద్యార్థులు వచ్చారు. వారితో పాటు వారి తల్లిదండ్రులు రావడం, ఇతర కారణాలతో కరోనా వచ్చి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. పాఠశాలలో క్వారంటైన్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
ముత్తంగిలో నిలకడగా విద్యార్థినుల ఆరోగ్యం..
ముత్తంగి జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో 47 మంది విద్యార్థినులు, టీచింగ్ స్టాఫ్ ఒకరికి కరోనా పాజిటివ్ వెలుగు చూసిన సంగతి విదితమే. కొంతమంది విద్యార్థినులకు విరోచనాలు, వాంతులు అయ్యాయి. ఇప్పుడు వారంతా క్షేమంగా ఉన్నారని వైద్యశాఖ అధికారులు తెలిపారు. పెద్దగా కరోనా లక్షణాలు కూడా వారికి లేవని తెలిపారు. అందరి ఆరోగ్యాలు మెరుగవుతున్నాయని పాఠశాల ఉపాధ్యాయులు, వైద్యాధికారులు పేర్కొన్నారు.