సంగారెడ్డి అర్బన్, డిసెంబర్ 2 : తెలంగాణలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)ల్లో ఉమ్మడి మెదక్ జిల్లా బ్యాంకు నంబర్‌వన్ స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకున్నది. కేవలం మూడేండ్లలో 1.60 లక్షల రైతులకు ఆర్థికపరమైన సేవలను అందించడంతోపాటు బ్యాంకు లావాదేవీలను రూ.450 కోట్ల నుంచి రూ.1650 కోట్లకు విస్తరించేలా కృషిచేసినందుకు చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, బ్యాంకు సిబ్బంది సేవలను కేంద్రం గుర్తించి ప్రత్యేకంగా అభినందించింది. గురువారం ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ చేతుల మీదుగా చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, సీఈవో శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల ప్రోత్సాహంతో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచేలా ఉమ్మడి మెదక్ డీసీసీబీని తీర్చిదిద్దినట్లు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతోనే ఈ గుర్తింపు దక్కిందన్నారు.