దీపావళి పండుగ సమీపిస్తుండడంతో మార్కెట్లో జోష్ నెలకొంది. పండుగకు కావాల్సిన సామగ్రి కొనుగోళ్లలో జనం బిజీగా ఉన్నారు. లక్ష్మీపూజలు, నోములకు కావాల్సిన సామగ్రిని మహిళలు కొనుగోలు చేస్తున్నారు. పేనీలు, సేమియాలు, దీపంతలు, పువ్వులు,లక్ష్మీదేవీ చిత్రపటాలు, కొత్త డైరీలు, పటాకుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పటాకుల దుకాణాల వద్ద చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు.
సంగారెడ్డి/మెదక్/మెదక్ రూరల్/రామాయంపేట,నవంబర్ 2 : దీపావళి పండుగకు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పటాకులు కొనుగోలు చేస్తుండడంతో దుకాణాల్లో సందడి నెలకొన్నది. పండుగ కోసం దీపంతలు, గుమ్మడికాయలు, రంగురంగుల పూలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో వ్యాపారస్తులు పటాకుల దుకాణాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ఎటువంటి అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహిస్తుండడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బాణాసంచా కాల్చే సమయంలో చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గతేడాది కరోనా ప్రభావంతో పండుగ హడావుడి కనిపించలేదు. ఈ సారి పరిస్థితి కాస్త మెరుగుపడటంతో పండుగను సంతోషంగా జరుపుకొనేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు.
సంగారెడ్డిలో 153 దుకాణాలకు అనుమతి..
దీపావళి పండుగ రాగానే వ్యాపారస్తులు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి పటాకులు విక్రయిస్తారు. సంగారెడ్డి జిల్లాలో 153 దుకాణదారులు అనుమతులు తీసుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధికంగా 116 దుకాణాలు ఏర్పాటయ్యాయి. నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకోకపోవడంతో అనుమతులు ఇవ్వలేదు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో 12, సంగారెడ్డి పట్టణంలోని రైతు బజార్, గంజిమైదానం, 65 జాతీయ రహదారి పోతిరెడ్డిపల్లి శివారులోని హోల్‌సేల్ దుకాణాలు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి పరిధిలో కేవలం 15, సదాశివపేట పట్టణంలో10 దుకాణాలకు అనుమతులు తీసుకున్నారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో పటాకుల అమ్మకాలు ప్రతి సంవత్సరం జోరుగానే సాగుతాయి. జిల్లా కేంద్రమైన మెదక్‌తో పాటు తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 18 దుకాణాలు వెలిశాయి. తూప్రాన్‌లో ప్రభుత్వ దవాఖాన ఎదుట, నర్సాపూర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో తాత్కాలిక దుకాణాల కోసం అనుమతులు కోరుతూ అగ్ని మాపక శాఖకు 37 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో మెదక్ 18, మంబోజిపల్లి 1, తూప్రాన్ 8, రామాయంపేట 3, నర్సాపూర్ 4, పెద్దశంకరంపేట 2, చేగుంట 1 దరఖాస్తులు వచ్చాయి. మున్సిపల్, పంచాయతీ, అగ్నిమాపక, పోలీసు, విద్యుత్ శాఖల నుంచి అనుమతి తీసుకొని జిల్లా కలెక్టరేట్‌కు మంగళవారం వరకు 40 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.
అనుమతులు తప్పనిసరి …
ప్రధాన పట్టణాల్లో పటాకుల వ్యాపారం నిర్వహించేందుకు స్థానిక మున్సిపల్ లేదా నగర పంచాయతీ అనుమతులతో పాటు విద్యుత్, పోలీస్, అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాలి. దుకాణం ఏర్పాటుకు యజమానులు ఆన్లైన్లో రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. దుకాణాల సమీపంలో అగ్ని అంటుకునే వస్తువులను దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ఇసుక, 200 లీటర్ల సామర్థ్యం గల నీటి డ్రమ్ములను అందుబాటులో పెట్టుకోవాలి. విద్యుత్ తీగల కింద దుకాణాలను ఏర్పాటు చేసుకోకుండా బహిరంగ ప్రదేశంలో నిర్మించుకోవాలి. నిబంధనలను పాటించని యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
దీపావళి మార్కెట్ మొదలైంది
దీపావళి పండుగకు ఒక్క రోజే ఉంది. అందుకోసం అన్ని వస్తువులను తీసుకొచ్చిన. ఏ పండుగ వచ్చినా అందుకు కావాల్సిన వస్తువులను తీసుకొచ్చి విక్రయిస్తా. సుదూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవారు కూడా రామాయంపేటలో దిగి పండుగ సామగ్రి కొనుక్కుని వెళ్తారు. దశాబ్ద కాలం నుంచి ఈ వ్యాపారం చేస్తున్న.. స్థానికులతో పాటు చుట్టు పక్కల మండలాల ప్రజలు కూడా ఇక్కడే కొనుగోలు చేస్తారు.
ఎండీ బాబా, వ్యాపారస్తుడు, రామాయంపేట