సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 2 : ప్రభుత్వ కళాశాలల బలోపేతంపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన విద్యనందిస్తున్నది. ఏటా అధిక సంఖ్యలో సీట్లు భర్తీ కావడమే అందుకు నిదర్శనం. సంగాడ్డి జిల్లాలో మొత్తం 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, 4,080 సీట్ల భర్తీ కోసం 2021-22 విద్యా సంవత్సరానికి ఉన్నత విద్యా శాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పూర్తయిన మూడో దశ దోస్త్ అడ్మిషన్లలో భాగంగా మొత్తం 3,041 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అత్యధికంగా సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలకు ఈ ఏడాది 1500 సీట్లు కేటాయించగా, ఇప్పటికే 1320 మంది విద్యార్థులు తమ సీటును సొంతం చేసుకున్నారు. అత్యల్పంగా నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 44.33 శాతం మంది విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రవేశాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల పరిధిలో గల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా ప్రవేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 128 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, వాటితోపాటు అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లోనూ దోస్త్ ద్వారా ఆన్లైన్ ప్రవేశాలను చేపడుతున్నారు. దీంతో ఆయా కళాశాలకు ఉన్నత విద్యా మం డలి సీట్లను కేటాయిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా సీట్లను కేటాయించడం ద్వారా సీట్ల భర్తీలో అనేక అక్రమాలు జరిగేవి. అయితే అందుకు చెక్ పెడుతూ దోస్త్‌ను అమలు చేయడం ద్వారా అక్రమాలకు పూర్తిగా చెక్ పెట్టినట్టయింది. ఏ కళాశాలకు ఎన్ని సీట్లు కేటాయించాలి అనే విషయంపై పూర్తిగా ఉన్నత విద్యా మండలికే అధికారాలు ఉం టాయి. దీంతో ఒక కళాశాల నుంచి మరొక కళాశాలకు గతంలో మాదిరిగా ఫర్వార్డ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోవడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అదే సమయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీట్ల సంఖ్యను పెంచుతూ ప్రవేశాలు మెరుగుపడేలా చేసింది.
అత్యున్నత ప్రమాణాలు, ఆకర్షణీయమైన కార్యక్రమాలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నారు. ముఖ్యంగా యూ జీసీ నిబంధనల మేరకు నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా విద్యాబోధన జరుగుతున్నది. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు ఆకర్షణీయమైన జిజ్ఞాస, యువతరంగం వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న విద్యార్థి ఆకర్షిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏటా సీట్ల భర్తీ పెరుగుతున్నది. ఉదాహరణకు జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 650 నుంచి 700 సీట్లు భర్తీ అయ్యేవి. దోస్త్ వచ్చిన తర్వాత ఆ సంఖ్య క్రమంగా పెంచుతూ వచ్చారు. మొదట 1020 సీట్లు, ఆ తర్వాత 1320 సీట్లు, ప్రస్తుత ఏడాది 1500 సీట్లు కేటాయిస్తూ వచ్చారు. సీట్ల భర్తీ కూడా అంతే స్థాయిలో కొనసాగింది.
కళాశాలల వారీగా సీట్ల భర్తీ ఇలా..
ఈసారి అత్యధికంగా 1500 సీట్లను తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించగా, ఇప్పటికే 1320 మంది విద్యార్థులు తమ పేరు నమోదు చేసుకున్నారు. మూడు దశల దోస్త్ ప్రవేశాలకు మరో అవకాశం ఇస్తే మరిన్ని సీట్ల భర్తీ కానున్నాయి. జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మొత్తం 4,080 సీట్లను కేటాయించగా, ఇప్పటివరకు 3,041 సీట్లు భర్తీ అయ్యాయి. అత్యధికంగా పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 72.64 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇక్కడ 720 సీట్లు కేటాయించగా, ఇప్పటి వరకు 609 విద్యార్థి రిజిస్ట్రేషన్లు జరిగాయి. సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1500 సీట్లు కేటాయించగా, 1320 సీట్లకు స్టూడెంట్ రిజిస్ట్రేషన్స్ పూర్తి కాగా, 72.27 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. జోగిపేట నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో 360 సీట్లకు గాను 252 రిజిస్ట్రేషన్లు జరుగగా, 63.89 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 480 సీటలు గాను 310 రిజిస్ట్రేషన్లు, సదాశివపేట కళాశాలలో 420 సీట్లకు గాను 219 రిజిస్ట్రేషన్లు, సంగారెడ్డి మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 300 సీట్లకు గాను 173, నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 300 సీట్లకు గాను 158 విద్యార్థి రిజిస్ట్రేషన్లు జరిగాయి.
అందుబాటులో కొత్త కోర్సులు
ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులను కల్పించడంతో తారా డిగ్రీ కశాశాలలో ప్రవేశాలు పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యార్థులకు అవసరమైన మేరకు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అందుకు సంబంధించిన అధ్యాపకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తమకు ఇష్టమైన అనువైన కోర్సులను ఎంచుకొని ప్రభుత్వ విద్యను అందిపుచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలి.
-ప్రవీణ, జిల్లా ఐడీ కళాశాల, తారా కళాశాల ప్రిన్సిపాల్