ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర( Sammakka Jathara ) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ధర్మారం, నంది మేడారం, బొట్ల వనపర్తి, దొంగతుర్తి, ఎర్రగుంటపల్లి, కటికనపల్లి, చామనపల్లి, కొత్తూరు, నర్సింగాపూర్ గ్రామాలలో జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతుండగా ఇట్టి ఉత్సవాలలో భాగంగా బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క గద్దెల మీదికి చేరారు. దీంతో శుక్రవారం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్లకు ఒడి బియ్యం, బంగారం సమర్పించారు.
దొంగతుర్తి లోని సమ్మక్క గద్దెలను తహసీల్దార్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక సర్పంచ్ కొడారి మంగ హనుమయ్య, జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు లైట్ శెట్టి రాములు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శనివారం అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ఉత్సవాలు ముగియనున్నాయి.