తనను తాను నవమన్మథుడుగా ఎప్పుడో ప్రకటించుకున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్. అలాంటి సల్మాన్‌ని ఆయన సముఖంలోనే బోల్డ్ కామెంట్స్ చేశారు ఒకనాటి కథానాయిక ట్వింకిల్ ఖన్నా. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ టాక్‌షోలో ఇటీవల అమీర్‌ఖాన్‌తో కలిసి సల్మాన్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో సల్మాన్‌ని ఉద్దేశించి సరదాగా ట్వింకిల్ అడిగిన ప్రశ్నలు ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ఈ పెళ్లి కాని నవమన్మథుడికి సమాజంలో ఓ డజను మంది పిల్లలైనా ఉండివుండాలి. ఆ విషయం ఆయనక్కూడా తెలిసే అవకాశం లేదులే..’ అని సల్మాన్‌ఖాన్‌పై చమత్కారంతో కూడిన సెటైర్లు విసిరారు ట్వింకిల్ ఖన్నా. ‘నాకు పిల్లలు ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా?.. ఒకవేళ నిజంగా పిల్లలు ఉంటే మీ ముందుకు తీసుకురాకుండా ఉంటానా?’ అంటూ ధీటుగా సమాధానం ఇచ్చారు సల్మాన్.
ట్వింకిల్ కొనసాగిస్తూ.. ‘ఎవర్నైనా దత్తత తీసుకోవచ్చుగా?’ అని అడగ్గా.. ‘అలాంటి ఆలోచన నాకు లేదు. భవిష్యత్తులో తప్పకుండా నాకు పిల్లలైతే ఉంటారు.’ అని సింపుల్‌గా సమాధానమిచ్చారు సల్మాన్. ‘దానికి ఇంకా సమయం మిగిలుందంటావా?’ అని ట్వింకిల్ ప్రశ్నించగా, ‘ఆ దేవుడి దయ వల్ల అది ఎప్పుడైనా జరగొచ్చు. కచ్చితంగా నా జీవితంలో ఒక బిడ్డ అయితే ఉంటుంది. వారి ఆలనా పాలనా నా కుటుంబం చూసుకుంటుంది. నా మేనకోడలు అలీజ్, మేనల్లుడు అయాన్ కూడా పెద్దవారయ్యారు. వాళ్లే నా బిడ్డని చూసుకుంటారు.’ అంటూ సల్మాన్ సమాధానమిచ్చారు. రాబోయే డిసెంబర్‌కు ఆయన 60లోకి అడుగుపెడతారు. ఇన్నాళ్లూ పెళ్లీ, పిల్లల గురించి ఆలోచించని సల్మాన్‌కి ఇప్పుడు ఒక్కసారిగా తండ్రి కావాలనే కోరిక కలగడం నిజంగా చర్చనీయాంశమైంది.