ఒకప్పుడు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో హౌజింగ్ డిమాండ్ ఎలా ఉన్నా.. హైదరాబాద్‌లో మాత్రం గిరాకీకి ఢోకా లేకుండా ఉండేది. ఏ రిపోర్టు చూసినా.. మరే విశ్లేషణలు విన్నా.. హైదరాబాద్ రియల్టీ అదుర్స్ అనే మాటే. కానీ ఇప్పుడు సీన్ రివర్సైంది. హైదరాబాద్‌లోనూ మందగమనం ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 : భారతీయ నిర్మాణ రంగాన్ని స్తబ్ధత ఆవరించింది. హైదరాబాద్ (Hyderabad) సహా అన్ని ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు గతంతో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదికలో తేటతెల్లమైంది. అయితే రెండేండ్ల క్రితం దేశంలోని మిగతా నగరాల సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్ రియల్టీ (Real Estate) మాత్రం జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టిందన్నది గత రిపోర్టులే చెప్తాయి. కానీ ఇప్పుడు ఇతర నగరాల్లో కనిపించే మందగమనమే ఇక్కడ కూడా కనిపిస్తుండటం గమనార్హం. దీంతో హైదరాబాదీ రియల్టీ సైతం రిస్క్‌లో పడిందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిర్మాణ రంగాభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలివ్వడం.. ఐటీ, ఫార్మా, ఏవియేషన్ తదితర కీలక రంగాలకు వెన్నుదన్నుగా నిలవడంతో ప్రాజెక్టులు పెరిగాయని, కొనేవారు సైతం ఎక్కువయ్యారని చెప్తున్నారు. పెరిగిన ఉద్యోగావకాశాలు సైతం స్థిరాస్తి రంగానికి కలిసొచ్చాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే 2014 నుంచి దాదాపు పదేండ్లపాటు రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయిందని వివరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ ఉత్సాహం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో జరిగిన ఇండ్ల అమ్మకాలపై అనరాక్ ఓ నివేదికను ఇచ్చింది. జూలై మొదలు ఈ నెలలో ఇప్పటిదాకా ఉన్న వివరాల ప్రకారం రూపొందించిన ఈ రిపోర్టులో గృహ విక్రయాలు 9 శాతం పతనమైనట్టు చెప్పింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాల్లో గత ఏడాది జూలై-సెప్టెంబర్‌లో 1,07,060 యూనిట్ల సేల్స్ జరిగాయి. కానీ ఈసారి 97,080 యూనిట్లకే పరిమితమైనట్టు పేర్కొన్నది. చెన్నై, కోల్‌కతా మినహా మిగతా 5 నగరాల్లో ఇండ్ల అమ్మకాలు పడిపోయాయి. చెన్నైలో 33 శాతం పెరిగి 4,510 యూనిట్ల నుంచి 6,010 యూనిట్లకు చేరాయి. కోల్‌కతాలోనూ 4 శాతం వృద్ధి చెంది హౌజింగ్ సేల్స్ నిరుడుతో చూస్తే 3,980 యూనిట్ల నుంచి 4,130 యూనిట్లకు పెరిగాయి.
ఖరీదైన ఇండ్లకు గిరాకీ పెరిగినట్టు తాజా నివేదికలో అనరాక్ వెల్లడించింది. యూనిట్లపరంగా గత ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో చూస్తే ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు పతనమైనా.. విలువపరంగా సేల్స్ వాల్యూ 14 శాతం పెరిగింది. పోయినసారి అమ్మకాల విలువ రూ.1.33 లక్షల కోట్లుగా ఉంటే.. ఈసారి అది రూ.1.52 లక్షల కోట్లుగా ఉన్నట్టు అనరాక్ వివరించింది. ఇంటి ధరలు పుంజుకోవడం, లగ్జరీ ఇండ్ల విక్రయాలు పెరగడమే కారణమని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి విశ్లేషించారు.