హైదరాబాద్, సెప్టెంబర్6 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో ఉన్నతాధికారుల తీరు మళ్లీ మొదటికొచ్చింది. పార్ట్‌టైం, ఔట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలలుగా వేతనాలు చెల్లించడమే లేదు. ఈ సొసైటీ పరిధిలో సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), నాన్ సీవోఈలు, ప్రత్యేక గురుకులాలు, స్పోర్ట్స్ అకాడమీలు, వొకేషనల్ గురుకులాలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లో పార్ట్‌టైమ్ సిబ్బంది, గెస్ట్ ఫ్యాకల్టీలు, సబ్జెక్ట్ అసోసియేట్లు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లు, ఔట్సోర్సింగ్ సిబ్బందితో కలిసి దాదాపు 2,500 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయా సిబ్బందికి జూలై, ఆగస్టు నెలల వేతనాలను ప్రభుత్వం చెల్లించలేదు.
వివిధ క్యాటగిరీల్లోని నాన్ రెగ్యులర్ సిబ్బందికి 3 నెలలుగా వేతనాలు రాలేదని బాధిత ఉద్యోగులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ గురుకులంలోని బోధనేతర, ఔట్సోర్సింగ్ సిబ్బందికి సైతం 2 నెలలుగా వేతనాలు అందడం లేదు. ప్రభుత్వ తీరుపై గురుకుల రెగ్యులర్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వచ్చేదే చాలీచాలని జీతమని, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమయానికి ఇవ్వడం లేదని, గత ప్రభుత్వంలో లేని ఇబ్బంది, ఇప్పుడే ఎందుకు వచ్చిందని పార్ట్‌టైం ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వేతనాలను అందరికీ చెల్లించినట్టుగానే 1వ తేదీనే క్రమం తప్పకుండా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.