హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తాతాలిక పద్ధతిలో సేవలందిస్తున్న పారా మెడికల్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని హైకోర్టు ఇటీవల బీహెచ్ఈఎల్కు ఆదేశాలు జారీ చేసింది. దశాబ్దానికిపైగా సేవలందిస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయకపోవడం వివక్ష చూపడమేనంటూ బీహెచ్ఈఎల్ తీరును తప్పుబట్టింది. దొడ్డిదారిన కాకుండా చట్టబద్ధంగా కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందేనని స్పష్టం చేసింది.
తాతాలిక ఉద్యోగుల సర్వీసులను ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నందున వారి సేవలు అవసరమేనని స్పష్టమవుతున్నదని, పిటిషనర్లు శాశ్వత నియామకానికి అర్హులైనందున వారి సర్వీసును క్రమబద్ధీకరించి, చట్టప్రకారం వేతన ప్రయోజనాలను కల్పించాలని ఆదేశించింది. బీహెచ్ఈఎల్లో చాలా కాలం నుంచి పారా మెడికల్ తాతాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ జీ దుర్గాప్రసాద్ మరో 28 మంది హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల ఈ ఆదేశాలు జారీ చేశారు.