సిటీ బ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో జనాభా పెరుగుతున్నకొద్దీ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, స్వీట్ హౌస్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఉరుకులు పరుగుల జీనవ విధానం వల్ల ప్రజల్లో ఆహారపు అలవాట్లు మారుతూ వస్తున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుని కొన్ని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఆహారానికి రుచి, రంగు, వాసన కల్పించడానికి ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి, దూర ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఆహారం చెడిపోకుండా ఉండటానికి ఆహార పదార్థాల సహజ స్వరూపాన్ని, సహజ లక్షణాన్ని కోల్పోయేలా చేస్తున్నారు.
అలాంటి ఆహార పదార్థాలను తిని ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీల్లో ఆహారానికి మంచి రుచి రావడానికి మోనోసోడియం గ్లుటామేట్ (నిమ్మ ఉప్పు)ను ఇష్టానుసారంగా వాడుతున్నారు. ముఖ్యంగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తయారు చేసే ప్రతి ఆహార పదార్థంలోనూ దీన్ని తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. మోనో సోడియం గ్లుటామేట్‌ను కలిపిన ఆహార పదార్థాలను తరచూ తినడం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ఆహార భద్రత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నా.. దీన్ని పట్టించుకోవడం లేదు.
ఆహార ఉత్పత్తుల్లో విచ్చలవిడిగా వాడకం..
మోనో సోడియం గ్లుటామేట్‌ను టేస్టింగ్ సాల్ట్‌ను నిమ్మ ఉప్పు అని కూడా అంటారు. దీన్ని చెరకు, కసావా, మొక్కజొన్న వంటి ఉత్పత్తుల నుంచి కానీ, మొలాసిస్ నుంచి గానీ ఉత్పత్తి చేస్తారు. దీన్ని చిన్న పిల్లలు తినే చిప్స్ పొట్లాలు, ఫాస్ట్ సెంటర్లలో వాడే సాస్‌లు, నూడిల్స్, మంచూరియాలు, బిర్యానీలో వినియోగిస్తున్నారు. ప్రాసెసింగ్ ఆహార ఉత్పత్తుల్లో కూడా దీన్ని వినియోగిస్తున్నారు.
టేస్టింగ్ సాల్ట్‌ను బహిరంగంగానే విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆహార భద్రత అధికారులు రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు చేస్తున్నా దీన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మోనో సోడియం గ్లుటామేట్‌ను వినియోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నాడీ మండల, సంతాన సంబంధిత వ్యాధులు..!
మోనో సోడియం గ్లుటామేట్‌ను వాడిన ఆహార పదార్థాలను తరచూ తీసుకున్నవారిలో నాడీమండల సంబంధిత, ఫెర్టిలిటీ సబంధిత వ్యాధులు సంభవిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్‌ను తినేవారిలో ఈ సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, మతిమరుపు సమస్యలు వస్తున్నాయి. యుక్త వయస్సు వారిలో సంతాన లేమి సమస్యలకు టేస్టింగ్ సాల్ట్ దారితీస్తున్నది. మహిళల్లో అండం ఉత్పత్తిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల గర్భం దాల్చే శక్తిని కోల్పోతున్నారు.
ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్నవారిలో లైంగిక హార్మోన్ల ఉత్పత్తిపై మోనోసోడియం గ్లుటామేట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఇది పీయూష గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లను నియంత్రిస్తున్నది. దీంతో స్త్రీ, పురుష హార్మోన్ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నదని నిపుణులు చెప్తున్నారు. పెద్ద వాళ్లలో నాడీమండలంపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల మతిమరుపు సమస్యలు వస్తున్నాయి. అది తీవ్రస్థితికి దారితీసి అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. టేస్టింగ్ సాల్ట్ వినియోగాన్ని ఆహారంలో తగ్గించాలని సూచిస్తున్నారు. దాన్ని వాడే హోటళ్లు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వద్ద ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.