సిటీబ్యూరో, సెప్టెంబర్ 6, (నమస్తే తెలంగాణ): నేషనల్ పోలీస్ అకాడమీకి చెందిన 170మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిటీ పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ వారికి తన అనుభవాలను వివరించారు. గణేశ్ ఉత్సవాల బందోబస్తు నిర్వహించడం తనకు 13వ సారి అని, తాను హైదరాబాద్ నగరంలో పదేళ్లుగా విధులు నిర్వహించిన అనుభవాన్ని పంచుకున్నారు.
దేశంలోనే అత్యంత సున్నితమైన, విస్తారమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటని, ఇక్కడ పనిచేయడం ఎంతో అనుభవాన్ని ఇస్తుందని ఆనంద్ వారికి చెప్పారు. గణేశ్ ఉత్సవాలకు పోలీసులు బందోబస్తు ఎలా నిర్వహిస్తారో చెబుతూ నిమజ్జనం వంటి భారీ ఉత్సవం జరిగే సమయంలో తొక్కిసలాట జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వివరించారు.
గణేశ్ ఉత్సవాలు, మిలాన్ ఉన్ నబీ, బోనాలు, దసరా నవరాత్రులు, హనుమాన్ ర్యాలీ, శ్రీరామనవమి ర్యాలీ వంటి ఉత్సవాల సందర్భంలో హైదరాబాద్ పోలీసులు అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళిక, సన్నాహాలు, వ్యూహాలు ఇతర చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో బేసిక్ కోర్సు డిప్యూటీ డైరెక్టర్ శ్రీరామ్నివాస్ సేపట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ కల్మేశ్మర్ సింగేన్వార్, టీజీఐసీసీసీ ఐటిసెల్ డీసీపీ పుష్ప పాల్గొన్నారు.